CIA Lost nuclear device | హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు!
హిమాలయాల్లో నందాదేవీ వద్ద సీఐఏ చేపట్టిన కోల్డ్ వార్ మిషన్ విఫలమైంది. ప్లుటోనియంతో పనిచేసే న్యూక్లియర్ పరికరం ఇప్పటికీ లభ్యం కాకపోవడంతో రేడియేషన్ ముప్పుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
CIA Lost nuclear device | భారత దేశంలో అత్యంత ఎత్తైన హిమాలయ మంచు పర్వతాల్లోని నందాదేవీ ప్రాంతంలో అమెరికా అత్యంత రహస్యంగా, వివాదాస్పద సీఐఏ కోల్డ్ వార్ మిషన్ కొనసాగిస్తున్నది. చైనాలో అణు పరీక్షలు, మిస్సైల్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు కనుగొనేందుకు సీఐఏ కోవర్ట్ ఆపరేషన్‌ను దశాబ్దాల క్రితమే ప్రారంభించిందన్న వాదనలు ఉన్నాయి. ఈ మిషన్ కోసం ఉపయోగించిన న్యూక్లియర్ పరికరం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. అప్పట్లో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కూడా ఈ మిషన్ లో భాగస్వామ్యమైంది. ఈ మిషన్ ఫెయిల్ కావడంతో “ప్లుటోనియంతో పనిచేసే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జెనరేటర్” విపరీతమైన మంచు కారణంగా కన్పించకుండా పోయింది. ఈ పరికరంతో పర్యావరణ సమస్యలు, రేడియేషన్ ప్రభావం, భూ భౌతిక సమస్యలు తలెత్తె ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు, పరిసర ప్రాంత ప్రజలు నిత్యం బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. 1965 లోనందాదేవీ వద్ద ప్లుటోనియంతో నడిచే నిఘా పరికరం మాయంపై సీఐఏ రహస్య ఆపరేషన్ ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక దర్యాప్తును తిరిగి పరిశీలించడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి.
చైనా తొలిసారి 1964 సంవత్సరంలో జింజియాంగ్ లో ఆటమిక్ బాంబును పేల్చడం ద్వారా ప్రవంచ వ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా దేశం పెంటగాన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) లు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. చైనా దేశం అణు కార్యకలాపాలపై నిఘా కోసం రిమోట్ సెన్సింగ్ స్టేషన్ ను ఎవరెస్టు పర్వతాలపై ఏర్పాటు చేయాలని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అధిపతి పెంటగాన్ ను సూచించారు. చైనా దేశానికి ఎవరెస్టు పర్వతం సరిహద్దుల్లో ఉండడం సమస్యగా మారింది. భారత్ ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాత ఉత్తరాఖండ్ గర్వాల్ హిమాలయం పైన నందాదేవీ ప్రాంతంలో పెంటగాన్ రిమోట్ సెన్సింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో సీఐఏ, 10 అడుగుల ఎత్తుతో అంటెన్నా, రెండు ట్రాన్సీవర్ సెట్లు, ఫ్లుటోనియంతో నడిచే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జెనరేటర్ అమర్చారు. ఇందులో ఏడు ఫ్లుటోనియం క్యాప్సుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి కార్యకలాపాల నిర్వహణ కోసం భారత మిలిటరీ కెప్టెన్, పర్వతారోహకుడు మన్మోహన్ సింగ్ కొహ్లీ నలుగురు ఐటీబీపీ సిబ్బంది, ఫూ డోర్జీ షెర్పా తో పాటు పద్నాలుగు మంది షెర్ఫాలతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. షెర్పా జాతులకు చెందినవారు టిబెట్ దేశానికి చెందినవారు. ఉత్తర నేపాల్ పర్వత ప్రాంతాలలో జీవిస్తారు. కోహ్లీ నాయకత్వంలో వీరందరూ అమెరికా వెళ్లి శీక్షణ తీసుకుని 1965 మధ్యలో తిరిగి భారత్ చేరుకున్నారు. అమెరికా ప్రభుత్వం తరఫున బేరీ బిషప్ నాయకత్వంలో మరో టీమ్ ను ఏర్పాటు చేసి, రెండు టీముల మధ్య సమన్వయం చేశారు. చైనా లోకి ఇంటెలిజెన్స్ ప్రతినిధులు వెళ్లే అవకాశాలు లేకపోవడం, సీఐఏ తన లక్ష్యాన్ని హిమాలయ పర్వతాలలోని నందాదేవీ ప్రాంతాన్ని ఎంపిక చేసిందంటున్నారు. నందాదేవీ, భారత్ చైనా సరిహద్దు వద్ద 25,645 అడుగుల (7,816 మీటర్లు) ఎత్తులో ఉండడం కూడా ప్రధాన కారణం. భారత దేశంలో పర్వతాల ఎత్తులో నందాదేవీ రెండోది కాగా ప్రపంచంలో 23వది. యూఎస్ లో శిక్షణ పొందిన రెండు టీములు 1965 సెప్టెంబర్ నెలలో ప్లూటోనియంతో నడిచే ఎస్ఎన్ఏపీ-19సీ పోర్టబుల్ న్యూక్లియర్ జనరేటర్ ను ఏర్పాటు చేశాయి. జపాన్ దేశంలో నాగసాకి పై బాంబు దాడికి ఉపయోగించిన ఫ్లుటోనియంలో మూడో వంతు ఇక్కడ ఉపయోగించారు. అక్టోబర్ 16న పని పూర్తి కావడంతో తన టీమ్ ను వెనక్కి రావాల్సిందిగా కొహ్లీ ఆదేశించారు. అయితే 1966 మే నెలలో న్యూక్లియార్ జనరేటర్, ఫ్లుటోనియం క్యాప్సుల్స్ ను వెనక్కి తీసుకువచ్చేందుకు నందాదేవీకి టీములోని కొందరిని పంపించారు. ఆ ప్రాంతానికి వెళ్లిన వారికి ఎలాంటి పరికరం కాని, ఫ్లుటోనియం జాడలు కన్పించలేదు. న్యూటాన్ డిటెక్టర్లతో వాటిని వెతికే ప్రయత్నం చేసినా ఆ పరిసన ప్రాంతాల్లో ఆనవాళ్లు కన్పించలేదు. మంచు పర్వతాల కొండ చరియలు విరిగిపడడంతో ఫ్లుటోనియం మరింత లోతులోకి చేరుకున్నట్లు అంచనాకు వచ్చారు. మంచులో ఫ్లుటోనియం కరిగి పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉండవచ్చనే భయం ఇప్పటికీ వెంటాడుతున్నది.
అయితే 1978 సంవత్సరంలో ఈ వార్త ప్రపంచానికి తెలిసింది. 1978 ఏప్రిల్ నెలలో అమెరికా చట్ట సభల్లో సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తగా, వారం రోజుల తరువాత భారత పార్లమెంటు లో సభ్యులు ప్రస్తావించారు. అప్పటి ప్రధాన మొరార్జీ దేశాయ్ మిషన్ తదనంతర పరిణామాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆరుగురు ప్రముఖ సైంటిస్టులతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో డాక్టర్ ఆత్మారామ్, హోమీ సేత్నా, ఎంజీకే మీనన్, డాక్టర్ రాజారామన్న, డాక్టర్ వీ రామలింగస్వామి, డాక్టర్ ఏకే సాహ ఉన్నారు. 1978 సంవత్సరంలో కమిటీ తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. నందాదేవీ ప్రాంతంలో క్రమం తప్పకుండా రేడియో ధార్మికతపై పరీక్షలు జరపాలని, గాలి, నీరు, నేల సారం పై నమూనాలు సేకరించాలని సిఫారసు చేసింది. రేడియో ధార్మికతపై ఎప్పటికప్పుడు వచ్చే అధునాతన సాంకేతికను అందిపుచ్చుకుని పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మిషన్ లో సభ్యుడు అయిన అమెరికన్ పర్వతారోహకుడు జిమ్ మెక్ కార్టీ మాట్లాడుతూ, ఫ్లుటోనియం మంచులో కరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. దీని వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని, తనకు టెస్టిక్యూలర్ క్యాన్సర్ సోకిందన్నారు. హిషన్ లో పాల్గొన్నందుకు సోకిందని, తమ కుటుంబంలో ఎవరికి ఇలాంటి వ్యాధి లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ పరికరం దేశ ద్రోహులు, తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తే ప్రపంచ దేశాలకు ముప్పు ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నందాదేవీ ప్రాంతంలో 2021లో మంచు చరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లుటోనియం కారణంగానే వాతావరణంలో మార్పులు సంభవించి మంచు చరియలు విరిగిపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ మిషన్ పై యూఎస్ తో పాటు భారత ప్రభుత్వాలు ఇప్పటికీ మౌనంగా ఉంటున్నాయి. అమెరికా కు చెందిన సీఐఏ కూడా ఇప్పటి వరకు ఎక్కడా ఈ మిషన్ గురించి ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ మిషన్ ఇప్పటికీ భారత శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, హిమాలయ ప్రాంత గ్రామ ప్రజలు, పర్వాతారోహకులకు చిక్కు వీడని సమస్యగా పరిణమించింది.
ఇవి కూడా చదవండి :
Cinema Tree | 200 సినిమాల చెట్టు మళ్లీ చిగురించింది.. 150 ఏళ్ల సినీ చరిత్రకు కొత్త ఊపిరి
Anil Ravipudi | చిరంజీవి మాటకే ఎదురు చెప్పిన అనిల్ రావిపూడి.. నెట్టింట ఇదే హాట్ టాపిక్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram