Cinema Tree | 200 సినిమాల‌ చెట్టు మళ్లీ చిగురించింది.. 150 ఏళ్ల సినీ చరిత్రకు కొత్త ఊపిరి

Cinema Tree | గోదావరి గట్టున కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో ఉన్న నిద్రగన్నేరు చెట్టును ‘సినిమా చెట్టు’గా పిలుస్తారన్న విషయం సినీ ప్రేమికులకు తెలిసిందే. ఈ చెట్టు కింద షూటింగ్ చేసిన సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయన్న బలమైన నమ్మకం చిత్ర పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది.

  • By: sn |    movies |    Published on : Dec 15, 2025 1:00 PM IST
Cinema Tree | 200 సినిమాల‌ చెట్టు మళ్లీ చిగురించింది.. 150 ఏళ్ల సినీ చరిత్రకు కొత్త ఊపిరి

Cinema Tree | గోదావరి గట్టున కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో ఉన్న నిద్రగన్నేరు చెట్టును ‘సినిమా చెట్టు’గా పిలుస్తారన్న విషయం సినీ ప్రేమికులకు తెలిసిందే. ఈ చెట్టు కింద షూటింగ్ చేసిన సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయన్న బలమైన నమ్మకం చిత్ర పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. అలాంటి విశేష చరిత్ర కలిగిన చెట్టు గత ఏడాది పిడుగుల పడి కూలిపోవడంతో గ్రామస్తులతో పాటు సినీ లోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ చెట్టు మళ్లీ చిగురించడం అందరికీ ఆనందాన్ని పంచుతోంది.గత ఏడాది తుఫాను సమయంలో రెండు పిడుగులు పడటంతో సుమారు 150 ఏళ్ల వయసున్న ఈ భారీ నిద్రగన్నేరు చెట్టు రెండుగా విడిపోయి కూలిపోయింది.

ఆకుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న చెట్టు..

చెట్టు భారీగా శాఖోపశాఖలుగా విస్తరించడంతో బరువు ఎక్కువైపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనతో ‘సినిమా చెట్టు ఇక గతమే’ అంటూ పెద్దలు ఆవేదన వ్యక్తం చేయగా, యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా తిరిగి బతికించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. గ్రామ యువత, పలు ఎన్‌జీవోలు, పర్యావరణ ప్రేమికులతో పాటు దర్శకుడు వంశీ లాంటి సినీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చి చెట్టు పునరుజ్జీవనానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పాత ఆయుర్వేద పద్ధతులు, ఆధునిక శాస్త్రీయ విధానాలను కలిపి చెట్టు వేర్లు, కొమ్మలను సంరక్షించారు. తొలుత ఇవన్నీ తాత్కాలిక ప్రయత్నాలేనని కొందరు అనుమానం వ్యక్తం చేసినా, కాలక్రమేణా చెట్టు మళ్లీ చిగురించడం ఆ అనుమానాలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆ నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ గోదావరి జిల్లా వాసులనే కాక సినీ పరిశ్రమను కూడా ఆనందంలో ముంచుతోంది.

ఆ సెంటిమెంట్‌తోనే..

ఈ సినిమా చెట్టుకు ఉన్న సినీ ప్రాధాన్యత అసాధారణం. తెలుగు క్లాసిక్ ‘మూగమనసులు’ సినిమా హిందీ రీమేక్ ‘మిలన్’ (1967) షూటింగ్ తొలిసారి ఈ చెట్టు కిందే జరిగింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఇక్కడ షూటింగ్ చేస్తే హిట్ అవుతుందన్న సెంటిమెంట్ మొదలైంది. ఆ తర్వాత అనేక హిందీ, తెలుగు చిత్రాల షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. తెలుగులో దాదాపు ప్రతి తరం అగ్ర నటులు ఈ చెట్టు కింద షూటింగ్ చేసినవారే.సూపర్ స్టార్ కృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ‘పాడిపంటలు’ సినిమా షూటింగ్ ఇక్కడ జరగడం, అది పెద్ద హిట్ కావడంతో ఆయన ఈ ప్రాంతాన్ని సెంటిమెంట్‌గా భావించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు సినిమాలు ఇక్కడ షూట్ కాగా, ‘సీతారామయ్య గారి మనవరాలు’ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

200 సినిమాల‌కి పైగా షూటింగ్..

కృష్ణంరాజు ‘త్రిశూలం’, శోభన్ బాబు ‘దేవత’, మహేష్ బాబు ‘మురారి’, దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘ప్రేమించు పెళ్లాడు’, ‘లేడీస్ టైలర్’ వంటి ఎన్నో చిత్రాలు ఇక్కడే చిత్రీకరించబడ్డాయి. తాజాగా రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ షూటింగ్ కూడా ఇదే పరిసరాల్లో జరగగా, అంతకుముందు ఆయన సూపర్ హిట్ మూవీ ‘రంగస్థలం’ కూడా ఇక్కడే తెరకెక్కింది. మొత్తంగా అటుఇటుగా 200కు పైగా సినిమాల షూటింగ్‌లు ఈ ప్రాంతంలో జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రస్తుతం మళ్లీ చిగురించిన ఈ సినిమా చెట్టు పూర్వ వైభవానికి రావడానికి కనీసం మరో పదేళ్లు పడుతుందని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. అయినా ఆ రోజు కోసం ఎదురుచూస్తూ, మళ్లీ ఈ చెట్టు కింద సినిమా షూటింగ్‌లు జరగాలని కుమారదేవం గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక చెట్టుతో ముడిపడిన 150 ఏళ్ల సినీ చరిత్రకు ఇది కొత్త జీవం పోసినట్లుగా భావిస్తున్నారు.