VRO వ్యవస్థ రద్దు చట్టం చెల్లదు: హైకోర్టులో న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు

VROలను రెవెన్యూశాఖలోకి తీసుకునేలా ఆదేశాలివ్వండి హైకోర్టులో VRO వ్యవస్థ రద్దుపై విచారణ.. కేసు ఈ నెల28కి వాయిదా VRO తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పీవీ కృష్ణయ్య హైదరాబాద్‌, విధాత: గ్రామ రెవెన్యూ అధికారుల (VRO) వ్యవస్థ రద్దు చెల్లదని హైకోర్టులో న్యాయవాది పీవీకృష్ణయ్య VROల తరపున తన వాదనలు వినిపించారు. VROల వ్యవస్థ రద్దు చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రిట్‌ పిటీషన్‌ […]

VRO వ్యవస్థ రద్దు చట్టం చెల్లదు: హైకోర్టులో న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు
  • VROలను రెవెన్యూశాఖలోకి తీసుకునేలా ఆదేశాలివ్వండి
  • హైకోర్టులో VRO వ్యవస్థ రద్దుపై విచారణ.. కేసు ఈ నెల28కి వాయిదా
  • VRO తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పీవీ కృష్ణయ్య

హైదరాబాద్‌, విధాత: గ్రామ రెవెన్యూ అధికారుల (VRO) వ్యవస్థ రద్దు చెల్లదని హైకోర్టులో న్యాయవాది పీవీకృష్ణయ్య VROల తరపున తన వాదనలు వినిపించారు. VROల వ్యవస్థ రద్దు చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రిట్‌ పిటీషన్‌ 31725/2022 నెంబరింగ్‌ అయింది.

ఈ కేసులో వాదనలు విన్న ఆనాటి న్యాయమూర్తి గత ఏడాది ఆగస్ట్‌ 8 వ తేదీన VROల రద్దు చట్టము 10/2020, జీవో నెంబర్ 121 /2022 మీద స్టే విధించింది. ఆతరువాత గురువారం ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా VROల తరపున న్యాయవాది పీవీ కృష్ణయ్య దాదాపుగా 45 నిమిషాలు వాదనలు వినిపించారు.

VROల రద్దు చట్టము భారతదేశ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పి పుచ్చు కోవడానికి కొన్ని జీవోలను పాత డేట్లలో జారీ చేయడం జరిగిందని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. VROల వ్యవస్థను రద్దు చేసే అధికారం తెలంగాణ శాసనసభకు లేదన్నారు. VROల వ్యవస్థను రద్దు చేయాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలన్నారు. ఆర్టికల్ 371(డి) కి విరుద్ధంగా రద్దు చట్టాన్ని ప్రవేశపెట్టారని, ఆ చట్టం చెల్లదన్నారు.

VROల వ్యవస్థను రద్దు చేయడం వల్ల VRAలకు రావలసిన పదోన్నతులు రావడం లేదని ఈ విషయంలో వీఆర్ఏలు తమ హక్కులను కోల్పోయారన్నారు. రాష్ట్ర శాసనసభలో VROలను ఉద్దేశించి అవినీతిపరులనే ముద్ర వేయడం వలన VROలు మనోవేదనకు గురయ్యారని, ప్రతి VROకు నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా చెల్లించాలని న్యాయస్థానాన్నికోరారు.

రాష్ట్రంలో ఉన్న VROల పోస్టులు కొత్తగా వచ్చినవి కావని, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి పోస్టులు అకస్మాత్తుగా రద్దు చేయడం వలన రెవెన్యూ శాఖ కుంటపడిపోయిందన్నారు. వీఆర్‌ఓల అనుభవాన్ని రెవెన్యూ శాఖలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకు న్యాయవాది తెలిపారు.

భూ రికార్డులన్నీ కంప్యూటరీకరణ అయిందని VROలు పోస్టును రద్దు చేస్తున్నామన్న ప్రభుత్వ వాదనలను న్యాయవాది పీవీ కృష్ణయ్య తప్పుపట్టారు. వాస్తవంగా VROలకు ఉన్నటువంటి జాబు చాటును వివరించారు. VROలు కేవలం భూ సంబంధిత పనులే కాదు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అనేకమైన విధులు నిర్వహిస్తారని న్యాయస్థానానికి తెలియజేశారు.

VROల తరపున న్యాయవాది పీవీ కృష్ణయ్య చేసిన వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. న్యాయవాదులు ఎవరైనా తమ వాదనలు వినిపించాలనుకుంటే ఈనెల 28లోపు న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి తెలియజేశారు. కేసును 28కి వాయిదా వేసింది.

VROల వ్యవస్థ రద్దు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి అపారమైన అనుభవం ఉన్న VROల సర్వీసును రెవెన్యూ శాఖలో కొనసాగించాలని VROల జేఏసీ తరపున చైర్మన్‌ గోల్కొండ సతీష్‌, అడిషనల్‌ సెక్రటరీ జనరల్‌ పల్లెపాటి నరేష్‌లు సంయుక్తంగా ఒక ప్రకటనలో కోరారు.