చంద్రునిపైకి 50 ఏళ్ల తర్వాత అమెరికా.. నేడు నింగిలోకి దూసుకెళ్లిన వుల్కన్ సెంటార్ వ్యోమనౌక
జాబిల్లి (Moon) పై ల్యాండ్ చేయడానికి అమెరికా (America) కు చెందిన వ్యోమనౌక సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది.

జాబిల్లి (Moon) పై ల్యాండ్ చేయడానికి అమెరికా (America) కు చెందిన వ్యోమనౌక సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది. కేప్‌కార్నివాల్ ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి జరిగిన ఈ ప్రయోగంలో వుల్కన్ సెంటార్ (Vulcan Centaur) అనే వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రునిపై ల్యాండ్ చేయడానికి ఓ వ్యోమనౌకను అమెరికా ప్రయోగించడం గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే వుల్కన్ సెంటార్‌ను ప్రభుత్వ సంస్థ నాసా కాకుండా యునైటెడ్ లాంచ్ ఎలయన్స్ ( యూఎల్ఏ)అనే ప్రైవేటు సంస్థ ప్రయోగించింది. తన అధునాతన రాకెట్ సాయంతో వ్యోమనౌకను అంతరిక్షంలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే..ఫిబ్రవరి 23న చంద్రుని మధ్య అక్షాంశ ప్రాంతమైన సైనస్ విస్కోసిటాటిస్‌లో తమ ల్యాండర్ పెరిగ్రెన్ దిగుతుందని యునైటెడ్ లాంచ్ అలయెన్స్ ప్రకటించింది.
అమెరికాను తిరిగి చంద్రునిపైకి తీసుకెళ్లడం ఒక గౌరవం. అపోలో మిషన్ తర్వాత అమెరికా నుంచి జాబిల్లి పైకి చేరుకుంటున్న అమెరికన్ వ్యోమనౌక ఇదే అని యూఎల్ఏ మాతృసంస్థ ఆస్ట్రోబోటిక్ సీఈఓ జాన్ థోర్టన్ చెప్పుకొచ్చారు. చంద్రునిపై ల్యాండ్ కానున్న పెరీగ్రిన్‌లో వివిధ రకాలు పరికరాలను పంపించారు. ఇవి అక్కడ ఉండే రేడియేషన్, చంద్రుని మట్టిలో ఉండే మూలకాలపై పరిశోధనలు చేస్తాయి. త్వరలో నాసా చంద్రునిపైకి మనుషులను పంపాలని యోచిస్తున్న నేపథ్యంలో వీరు సేకరించే సమాచారం… ఉపయోగపడనుంది. అయితే ఈ ల్యాండర్‌లో కొన్ని వివాదాస్పదమైన వస్తువలనూ చంద్రునిపైకి పంపించారు.
స్టార్ ట్రెక్ క్రియేటర్ జీన్ రెడెన్‌బరీ, ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత, శాస్త్రవేత్త ఆర్థర్ సీ క్లార్క్, ఓ శునకంకుకి చెందిన డీఎన్ఏ నమూనాలు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ తయారుచేసిన ఒక బూటు సైజు రోవర్‌ను, ఒక భౌతికమైన బిట్ కాయిన్‌ను పంపుతున్నారు. నాసా ఇటీవల తన ఖర్చును తగ్గించుకోవడానికి ప్రైవేటు కంపెనీలకు లాంచ్ బాధ్యతలను అప్పగిస్తున్న విషయం తెలిసిందే. కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సీఎల్‌పీఎస్) విధానం కింద కొన్ని పరికరాలను చంద్రునిపై చేర్చడానికి, ప్రాథమిక పరిశోధనలు చేయడానికి అవసరమైన మిషన్‌లను ఈ సంస్థలు నిర్వహిస్తాయి. ఆ ఫలితాలను నాసా తన ఆర్టిమిస్ మిషన్లకు ఉపయోగించుకుంటుంది. ఈ తాజా మిషన్ నిమిత్తం నాసా.. యూఎల్ఏకు 100 మిలియన్ డాలర్లను చెల్లించింది.