Warangal | రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చుట్టూ మూడుస్తంభాలాట

Warangal కోచ్ ఫ్యాక్టరీకి నామం - తెరపైకి పీఓహెచ్ కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ రాజకీయం మోడీ వరంగల్ పర్యటనకు ముందే రాజకీయ విమర్శల వేడి ఎన్నికల ఎజెండాగా మార్చిన పార్టీలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి: దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాజీపేటలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చుట్టూ రాజకీయ మూడు స్తంభాలాట సాగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలైన బిజెపి, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ప్రజలను వంచిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ పట్టించుకోకపోగా, తొమ్మిదేళ్లుగా […]

Warangal | రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చుట్టూ మూడుస్తంభాలాట

Warangal

  • కోచ్ ఫ్యాక్టరీకి నామం – తెరపైకి పీఓహెచ్
  • కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ రాజకీయం
  • మోడీ వరంగల్ పర్యటనకు ముందే రాజకీయ విమర్శల వేడి
  • ఎన్నికల ఎజెండాగా మార్చిన పార్టీలు
  • కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి: దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాజీపేటలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చుట్టూ రాజకీయ మూడు స్తంభాలాట సాగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలైన బిజెపి, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ప్రజలను వంచిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ పట్టించుకోకపోగా, తొమ్మిదేళ్లుగా అధికారం చెలాయిస్తున్న బిజెపి రాష్ట్ర విభజన అంశం కోచ్ ఫ్యాక్టరీని గల్లంతు చేసింది. ఇక ఎనిమిదేళ్ళు బీజేపీతో రాసుకు తిరిగి, ఈగవాలకుండా చేసిన బీఆర్‌ఎస్‌ ఈ అంశాన్ని తమ ఎన్నికల ప్రయోజనం కోసం వాడుకుందనే విమర్శలున్నాయి.

ఓట్లు దండుకునేందుకు పావు

పార్టీలన్నీ కోచ్ ఫ్యాక్టరీని ఎన్నికల ఎజెండాగా మార్చి ఓట్లు దండుకునే కార్యక్రమంగా తీర్చిదిద్దాయి. అధికారంలో ఎవరున్నా ఒకే తీరుగా వ్యవహరిస్తూ, పరస్పరం విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు. రాజకీయ అవసరం పడితేనే నాయకులకు కోచ్​ ఫ్యాక్టరీ యాదికొస్తున్నది. తమ ప్రయోజనాల కోసం చిరకాల ప్రజాకాంక్షను అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రజా, కార్మిక, రైల్వే సంఘాలు వీరి వలలో చిక్కుకుంటున్నాయి.

ఎజెండా నుంచి ఎత్తివేసిన బిజెపి

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పట్టించుకోకపోగా విభజన హామీలలో ఒకటైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎజెండా నుండే ఎత్తివేసింది. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో పిరియాడిక్ ఓవర్ హాయిలింగ్ యూనిట్ (POH) ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ యూనిట్ ఏర్పాటు కూడా దశాబ్ద కాలంగా జాప్యం అవుతూ వస్తోంది.

ఈ విషయంలో బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర విమర్శలతో తరచూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. రాష్ట్రం భూమి ఇవ్వలేదంటే, కేంద్రం నిధులు కేటాయించలేదని ఆరోపణలు చేసుకోవడం అలవాటుగా మారింది. ఎట్టకేలకు ఎన్నికల సంవత్సరంలో పిఓహెచ్ కు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తున్నారు. ఇప్పటికే దీనికోసం కేంద్ర బడ్జెట్లో రూ.160 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారు.

ప్రధాని రాక సందర్భంగా తెరపైకి కోచ్ ఫ్యాక్టరీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన వరంగల్ పర్యటన సందర్భంగా మరోసారి రాజకీయ విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీని తమ ఎజెండా నుంచి తొలగించిన బిజెపి దాని స్థానంలో ప్రధాని చేతుల మీదుగా పిఓహెచ్ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు.

8న ప్రధాని మోడీ రాక సందర్భంగా కేటీఆర్ శుక్రవారం మానుకోట వేదికగా విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీతో సహా హామీలు అమలు చేయని ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసి రాజకీయ సెగ పుట్టించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడానికి బిజెపి నిర్లక్ష్యం, బీఆర్ఎస్ చేతగానితనం కారణమంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది.

ఆరు నెలలుగా పరస్పర విమర్శలు

ప్రధాన పార్టీల నాయకుల పర్యటనల సందర్భంగా పరస్పర విమర్శలు, ఆరోపణలతో రక్తి కట్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఆరు నెలలుగా మరోసారి కాజీపేటలో రైల్వే పరిశ్రమల ఏర్పాటును అన్ని రాజకీయ పక్షాలు కల్పి పట్టాలెక్కించాయి. ముఖ్య నాయకులు వరంగల్లో పర్యటిస్తే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశం లేవనెత్తుతున్నారు.

బిజెపి పై బి ఆర్ఎస్, బీఆర్ఎస్ పై బిజెపి రెండు పార్టీలపై కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల నిరుద్యోగ మార్చ్‌కు బండి సంజయ్ హాజరైన సందర్భంగా, కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్రలో, మంత్రి కేటీఆర్ హనుమకొండ పర్యటన నేపథ్యంలో కోచ్‌ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తాయి. కోచ్‌ఫ్యాక్టరీ సాధన కోసం కాజీపేటలో జరిగిన ధర్మదీక్ష శిబిరం బిజెపి, బీఆర్ఎస్ ఆధిపత్యానికి అనువుగా మార్చుకునే ప్రయత్నం చేశారు.

బిజెపికి నిజాయితీ ఉంటే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి: దాస్యం

బిజెపికి నిజాయితీ ఉంటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం చేతకాని బిజెపి తమ పార్టీని విమర్శించే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధి పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. పిఓహెచ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాల భూమి కేటాయిస్తే, ఈ రైల్వే పరిశ్రమ ఏర్పాటుకు ఏళ్ల తరబడి జాప్యం చేస్తుందని అన్నారు. ఇప్పుడు శంకుస్థాపన చేస్తే ఈ పరిశ్రమ ఎప్పుడూ ప్రారంభమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.