Warangal | వరంగల్ తూర్పు BRSలో భగ్గుమన్న విభేదాలు
Warangal | కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బహిర్గతం సెగ్మెంట్లో ఆధిపత్య పోరుతో పెరిగిన గ్రూపులు వరంగల్ తూర్పులో ఫ్లెక్సీ వార్ ఫ్లెక్సీలపై ప్రేక్షకు పాత్ర వహిస్తున్న మంత్రి, అధికారులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ అధికార బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకాలం గుంభనంగా ఉన్న వరంగల్ తూర్పు నాయకులు తమ అసంతృప్తులను వెల్లగక్కుతున్నారు. శనివారం వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ […]

Warangal |
- కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బహిర్గతం
- సెగ్మెంట్లో ఆధిపత్య పోరుతో పెరిగిన గ్రూపులు
- వరంగల్ తూర్పులో ఫ్లెక్సీ వార్
- ఫ్లెక్సీలపై ప్రేక్షకు పాత్ర వహిస్తున్న మంత్రి, అధికారులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ అధికార బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకాలం గుంభనంగా ఉన్న వరంగల్ తూర్పు నాయకులు తమ అసంతృప్తులను వెల్లగక్కుతున్నారు. శనివారం వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా ఇంతకాలం అంతర్గతంగా సాగిన గ్రూపులు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.
మంత్రి రాక సందర్భంగా ఫ్లెక్సీ వార్
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ తూర్పులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ఆధిపత్య పోరు రోడ్డుకెక్కింది. మంత్రి రాక సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ భారీ స్థాయిలో అట్టహాసంగా సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాగతం పలుకుతూ వరంగల్ తూర్పు లోని ప్రధాన రహదారులన్నింటిని ఫ్లెక్సీలతో నింపేశారు.
ఇప్పటికే ఇతర నాయకులను తూర్పులో అడుగుపెట్టకుండా జాగ్రత్త వహిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న నన్నపనేని నరేందర్ ఈసారి కూడా ఎదుటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదని భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కట్టేసినట్లు భావిస్తున్నారు. అయితే ఇంతకాలం చూస్తూ ఊరుకున్న నాయకులు తమ నాయకుడు కేటీఆర్ రాక సందర్భంగానైనాన ఫ్లెక్సీలు పెట్టేందుకు అవకాశం లేకుండా చేస్తూ ఆధిపత్యం చెలాయించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.
మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో పాటు ఇతర నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో మేయర్ రంగంలోకి దిగి అధికారులను పురమాయించి నరేందర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి తాను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా రవిచంద్ర ఇతరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నన్నపనేని వర్గం నాయకులు తొలగించారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఒకరు ఏర్పాటు చేసినట్లయితే చీరను మనోఫలం తొలగించి తమ ఏర్పాటు చేసుకోవడంతో పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి పరిస్థితి మారింది.
ఇదిలా ఉండగా తూర్పులో శనివారం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా అసలు కట్టుకునేందుకే అవకాశం కల్పించలేదని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు మంత్రి రాక సందర్భంగా పలువురు బిజెపి, కాంగ్రెస్ ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషనులకు రాత్రి నుంచే తరలించారు మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రోడ్డు ఆజంజాహి మిల్లు గ్రౌండ్లో సభ ఏర్పాటు చేయడమే కాకుండా ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్ళించడం పై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయ పార్టీల సభల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇటీవల సాధారణమైపోయిందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు, మంత్రి
వాస్తవానికి ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధించినప్పటికీ ఇటీవల ఈ విషయాన్ని అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో ఈ ఫ్లెక్సీ ల పై పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులు ఆర్భాటం ప్రదర్శించి దాడులు చేసిన అధికారులు ఇప్పుడు ఆ వైపు చూడకపోవడమే కాకుండా దగ్గరుండి మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు సహకరించడం విడ్డూరం అంటున్నారు.
ఫ్లెక్సీల వల్ల ఏమి ఒరుగుతుందని వ్యాఖ్యానించిన మంత్రి కేటీ రామారావు సభలకు ఇటీవల పోటీపడి ఫ్లెక్సీలు కడుతున్నారు. గతంలో ఫ్లెక్సీలు కట్టిన సమయంలో ఫైన్ విధించిన అధికారులు గాని ఫైన్లు వేయాలని చెప్పిన మంత్రిగానీ ఇప్పుడు చూసి చూడనట్లు వ్యవహరించడం కొసమెరుపు.
అప్పట్లో యు ఫైన్ లు కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తమకు నచ్చితే ఒక తీరు తమకు నచ్చకపోతే మరొక తీరుగా పద్ధతులు, విధానాలు మారిపోతాయా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరు కూడా దిగజారి పోయే విధంగా ఉందని అంటున్నారు.
పెరిగిన ఆశావహుల సంఖ్య
ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం కోసం పోటీ పడుతున్న ఆశావాహుల సంఖ్య పెరగడంతో పార్టీలో గ్రూపు తగదాలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యవహార శైలి తమకు నచ్చకపోవడం వల్ల గ్రూపులు పెరుగుతున్నాయని నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేగా తన పని తాను చేసుకుంటూ పోతుంటే కావాలని గ్రూపులను రెచ్చగొట్టే విధంగా తమ పార్టీలోని ఇతర నాయకులు వ్యవహరిస్తున్నారని నన్నపనేని నరేందర్ తన అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.