Cm Revanth Reddy: దశాబ్దాల కల సాకారం.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు

- ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేల కృషి.
- మామూనూరు ఏయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అంగీకారం
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు
విధాత, వరంగల్: మామూనూరు ఏయిర్ పోర్ట్ (Mamoonur Airport) నిర్మాణానికి ప్రత్యేక చొరవతో అనేక సార్లు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపి ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి వరంగల్ ప్రజల చిరకాల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) కి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పుష్ప గుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మురళీ నాయక్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా మామూనూరు ఏయిర్ పోర్ట్ (Mamoonur Airport) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి వెంటనే ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వీలైనంత తొందరలో ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు విమానయాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.