Warangal | నర్సంపేటలో’ముందస్తు’ సాగు
Warangal వడగండ్లతో నష్టపోకుండా ముందు జాగ్రత్త వర్షాకాలం సాగుకు కొత్త ఆలోచన అమలు పాకాల ఆయకట్టుకు సాగునీటి విడుదల ఒక ప్రణాళికతో రెండు లాభాలు: ఎమ్మెల్యే పెద్ది విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముందస్తు సాగుకు నర్సంపేట రైతాంగం సన్నద్ధమైంది. వర్షాకాలం సాగు కోసం నియోజకవర్గంలోని ప్రధానమైన చెరువులలో నీటి విడుదలకు గురువారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సకాలంలో వర్షాలు పడనందున, ఇప్పటికే జలాశయాల్లో నిలువ ఉన్న నీటిని ఆయకట్టుకు వినియోగించేందుకు […]

Warangal
- వడగండ్లతో నష్టపోకుండా ముందు జాగ్రత్త
- వర్షాకాలం సాగుకు కొత్త ఆలోచన అమలు
- పాకాల ఆయకట్టుకు సాగునీటి విడుదల
- ఒక ప్రణాళికతో రెండు లాభాలు: ఎమ్మెల్యే పెద్ది
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముందస్తు సాగుకు నర్సంపేట రైతాంగం సన్నద్ధమైంది. వర్షాకాలం సాగు కోసం నియోజకవర్గంలోని ప్రధానమైన చెరువులలో నీటి విడుదలకు గురువారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సకాలంలో వర్షాలు పడనందున, ఇప్పటికే జలాశయాల్లో నిలువ ఉన్న నీటిని ఆయకట్టుకు వినియోగించేందుకు నిర్ణయించారు. వర్షాలు కురిసే వరకు ఆగకుండా ఈ లోపు నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రణాళిక అమలు చేస్తున్నారు.
పాకాల నుంచి ప్రారంభం..
నర్సంపేటలోని ప్రధానమైన పాకాల సరస్సు నుంచి నీటి విడుదలను గురువారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సరస్సు తూము గేట్లు ఎత్తి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.
పాకాల సరస్సుతోపాటు నియోజకవర్గంలోని ప్రధానమైన జలాశయాలు మాదన్నపేట చెరువు, పాకాల రంగయ్య చెరువు ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ ప్రణాళికతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సాగు పనులు చేపట్టేందుకు వీలుగా దుక్కులు సిద్ధం చేస్తున్నారు. నారుమళ్ల కోసం సన్నాహాల్లో నిమగ్నం అయ్యారు.
ఏటా వెంటాడుతున్న వడగండ్ల వర్షాలు
ఆరుగాలం కష్టపడి సరిగ్గా వేసవికాలం పంట చేతికొచ్చే సమయానికి నర్సంపేట నియోజకవర్గ రైతాంగంపై వడగండ్ల వానల రూపంలో ప్రకృతి చూపించే భీభత్సం అంతాఇంతా కాదు. గత నాలుగైదు ఏళ్లుగా వరుసగా సంభవిస్తున్న వడగండ్ల వానతో రైతాంగం చేతికి వచ్చిన పంటను పూర్తిగా నష్టపోతున్నారు.
దీనితో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలయ్యే దుస్థితి తలెత్తుతోంది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే దురవస్థ నెలకొంటున్నది. నర్సంపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానాలతో రైతాంగం తీవ్ర నష్టపోతున్న విషయం తెలిసిందే.
వాతావరణంలో మార్పుల ప్రభావం
పర్యావరణ పరమైన మార్పులు, వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఖగోళ, భూగోళ మార్పులు వీటి ప్రభావం రుతుపవనాల రాకపోకలపై చూపిస్తోంది. దీనివల్ల కాలంలో విపరీతమైన మార్పులు జరిగి అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవి వ్యవసాయంపై తీవ్ర ప్రభావం కనబరుస్తున్నాయి.
కాలచక్రంలో జరిగిన మార్పుల ఫలితంగా ఈ విపరీత సమస్యలు తలెత్తుతున్నట్లు ఇప్పటికే సంబంధిత శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే వ్యవసాయ సాగులో కూడా కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో ముందస్తు సాగును చేపట్టి, ప్రకృతి పరమైన నష్టాలనుంచి రైతాంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే ఒక సూచన చేసింది.
ఈ సూచనతో పాటు తరచు అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోతున్న నర్సంపేట రైతాంగం ఈ విషయంలో మేల్కొంది. అవసరమైన ముందస్తు సాగు చేపట్టేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో సంసిద్ధమయ్యారు. అయితే ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు లేకపోవడంతో రైతాంగం ముందస్తు సాగు పట్ల సందేహాలు నెలకొన్నాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా, ప్రస్తుతం జలాశయాల్లో నిల్వ ఉన్న నీటిని ఆయకట్టు రైతులకు విడుదల చేసి వాటి ద్వారా నారుమల్లు సిద్ధం చేసుకుంటే, తదుపరి కురిసే వర్షాలు నీటి లభ్యత పై ఆధారపడి సాగును ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ దూర దృష్టితో నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు.
అందుబాటులో గోదావరి జలాలు
ముందస్తు సాగుకు అనుగుణంగా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల రంగరాయ, మాదన్నపేట ప్రధాన జలాశయాలకు ఇప్పటికే గత సీజన్‌లో గోదావరి జిల్లాలు తరలించారు. యాసంగి సీజన్ అవసరాలకు పోను ఇంకా పెద్ద మొత్తంలో చెరువుల్లో గోదావరి జలాలు నిల్వా ఉన్నందున తమ ముందస్తు సాగు కార్యాచరణ చేపట్టేందుకు అడ్డంకులు లేకుండా పోయాయి.
ప్రతీ సంవత్సరం సంభవస్తున్న వడగండ్ల వానల కారణంగా జరిగే నష్టాన్ని తగ్గించేందుకు “సాగు ముందుకు” అనే ప్రక్రియను అవలంభించేందుకు నర్సంపేట రైతాంగం సిద్ధమైంది. ఈ నీటివిడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు డీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నాయకులు బత్తిని శ్రీనివాస్, మహాలక్ష్మి వెంకట నరసయ్య, రైతు సమన్వయ సమితి బాధ్యులు కుంచారపు వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమా ఉపేందర్ రెడ్డి, గుంటి కిషన్ , యువరాజు, మండల నాయకులు మరియు క్లస్టర్ బాధ్యులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పాకాల ఆయకట్టు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఒక ప్రణాళికతో రెండు లాభాలు: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఒక్క ప్రణాళికను అమలు చేయడం ద్వారా రెండు విధాల లాభాలు పొందే అవకాశాలు ఈ ముందస్తు సాగు వల్ల లభిస్తాయి. వానకాలం పంటను కొంతముందుగా ప్రారంభించడం ద్వారా సరైన సమయంలో హార్వెస్టింగ్ జరుగుతుంది. వెనువెంటనే వేసవి పంటను కూడా ప్రారంభించుకొని ప్రకృతి భీభత్సం వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవాలి.
పాకాల సరస్సుతోపాటు, పాకాల రంగయ్య చెరువు, మాదన్నపేట చెరువులు కూడా నిండుకుండలా జలకళతో కళకళలాడుతున్నందున ఆయకట్టు రైతులు అధైర్య పడకుండా ముందస్తు సాగును ప్రారంభించాలి.