Warangal
- ప్రజల వద్దకు పోలీసులు..
- కాజీపేటలో నిర్వహించిన నేరసమీక్షలో నిర్ణయం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఫిర్యాదు చేసేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి రాలేని దూర ప్రాంతాలకు చెందిన ప్రజల కోసం వారానికి ఒక రోజు మండల కేంద్రంలో పోలీస్ గ్రీవెన్స్ నిర్వహిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం కాజీపేటలో నిర్వహించారు.
డిసిపి, ఏసిపిలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ పరిధిలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్లో వున్న కేసులు వాటి స్థితి గతులపై పోలీస్ కమిషనర్ కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులకు పలు సూచనలు చేస్తూ ఎస్.హెచ్.ఓ లు పి.ఎస్. పరిధిలో గ్రామాలను సందర్శించి, గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోకాలని, గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న బెల్టు షాపులపై దృష్టి పెట్టాలి. అధికారులు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధను అర్థం చేసుకోవాలి, స్టేషన్ పరిధిలో చిన్న చిన్న సమస్యలపై తక్షణమే స్పందించాలి, స్థానిక సమస్యలపై దృష్టి సారించాలి.
అలాగే అధికారులు సందర్భాన్ని బట్టి విధుల్లో వ్యహరించాలని, నిస్వార్థంగా పని చేసి ప్రజల అభిమానాన్ని పొందాలని, తప్పుడు కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పక్షపాతంగా వ్యవహరించ కుండా సమన్యాయం చేయాలని, ఇకపై పోలీసు స్టేషన్లలో వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారి ఒకే సమయంలో ఇరు పక్షాల వారితో మాట్లాడి సమస్యకు గల కారణాలు గుర్తించాలని సూచించారు.
ఫిర్యాదులపై దర్యాప్తు కోసం డి.సి.పిలు, ఎసిపిలు సైతం గ్రామాలను సందర్శించి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయాలి. కిందిస్థాయి అధికారుల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ అవసరం, న్యాయానికి మొదటి పోలీస్ స్టేషన్ అని గుర్తించుకొని అధికారులు విధులు నిర్వర్తించాలి.
కేసుల రివ్యూ కోసం అధికారులు సమయాన్ని కేటాయించాలి, స్టేషన్ అధికారులు మధ్యాహ్న సమయాల్లో స్టేషన్ లో అందుబాటులో వుండాలని అన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉరుకోనూ.. అధికారులు టైం మేనేజ్మెంట్ పాటించాలి. ఫిర్యాదారులు అందజేసే ఫిర్యాదులకు స్టేషన్లలో తప్పని సరిగా పొలీస్ స్టేషన్ లో రసీదు అందజేయాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు.
విధుల్లో రాణించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు
సైబర్ విభాగంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు. ప్రశంస పత్రాలు అందుకున్న వారిలో సైబర్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ రెడ్డి, ఏ.ఏ.ఓ లు ప్రశాంత్, సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు అన్వర్ పాషా, రవిందర్, సురేష్ గౌడ్, రాజు, కిషోర్ వున్నారు.
సమావేశంలో డిసిపిలు మురళీధర్, అబ్ధుల్ బారీ, కరుణాకర్, అదనపు డిసిపి పుష్పా రెడ్డి, ట్రైనీ ఐ.పి.ఎస్ అంకిత్ కుమార్ తో పాటు ఎసిపిలుపాటు ఇన్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు పాల్గోన్నారు.