Plastic Can Water | ప్లాస్టిక్ క్యాన్లలో నీరు మంచిదా, కాదా?

  • By: sr    latest    Apr 05, 2025 9:39 AM IST
Plastic Can Water | ప్లాస్టిక్ క్యాన్లలో నీరు మంచిదా, కాదా?

Plastic Can Water |

భారతదేశంలో క్యాన్లలో దొరికే తాగునీటి వినియోగం బాగా పెరిగింది. అయితే, ఈ క్యాన్లను సరిగ్గా ఉపయోగిస్తున్నామా అనే సందేహం తలెత్తుతోంది. ఒక తాగునీటి డబ్బాను ఎన్నోసార్లు తిరిగి వాడుతుంటారు. అయితే, తరచుగా ఉపయోగించే ఇలాంటి క్యాన్లను నిర్ణీత కాలానికి మించి ఉపయోగించకూడదని మీకు తెలుసా? అలాగే, ఈ తాగునీటి క్యాన్లను మాత్రమే కాకుండా, వీటిని నిల్వ చేయడానికి ఇళ్లలో వాడే ‘బబుల్ టాప్’ క్యాన్లను కూడా శుభ్రంగా ఉంచుకుంటామా?

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన క్యాన్డ్ వాటర్ తయారీదారులు, అమ్మకందారులకు ఇటీవల నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆహార భద్రతా శాఖ అధికారులు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. వాటర్ క్యాన్లను 50 సార్లకు మించి వాడకూడదు. మురికి, గీరుకుపోయినట్లుగా ఉన్న తాగునీటి క్యాన్లను ప్రజలకు పంపిణీ చేయకూడదు. ఎండలో ఉంచిన తాగునీటి డబ్బాలను పంపిణీ చేయకూడదు. క్యాన్లలోని తాగునీరు కూడా కచ్చితంగా నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సంస్థ బాటిల్డ్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌ను అత్యంత ప్రమాదకర ఆహారాల జాబితా (హై రిస్క్ ఫుడ్ లిస్ట్)లో చేర్చింది. ఈ మేరకు నిరుడు నవంబరులో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌ను అత్యంత ప్రమాదకర ఆహారాల జాబితాలో చేర్చుతున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మామూలుగానైతే, ఎక్కువగా కలుషితం అయ్యే అవకాశమున్న ఆహార పదార్థాలను ఈ జాబితాలో చేర్చుతారు. ఈ జాబితాలోని ఆహారాల నాణ్యతను తనిఖీ చేయడానికి కఠినమైన నిబంధనలు పాటించాలి. ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ 2024 అక్టోబర్‌లో సవరించిన నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌కు కూడా బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి. అంతేకాకుండా, వీటిని తయారు చేసే కంపెనీలకు లైసెన్స్‌ మంజూరు చేసేప్పుడు, నమోదు చేయడానికి ముందు అధికారులు ఆ కంపెనీలను నేరుగా తనిఖీ చేయాలి. అలాగే, సంవత్సరానికి ఒకసారి వీటిని థర్డ్ పార్టీలతో తనిఖీ చేయిస్తుండాలి.

ఈ భద్రతా ప్రమాణాలను పాటించకపోతే ఇళ్లలో తాగునీటి క్యాన్లను ఉపయోగించేవారికి ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయి? తాగునీటి క్యాన్ సురక్షితంగా ఉందని ఎలా నిర్ధారించాలి?

మనం వాడే వాటర్ క్యాన్లపై బీఐఎస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చే నాణ్యతా పత్రం (క్వాలిటీ లైసెన్స్), గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్), బ్యాచ్ నంబర్ ఉన్నాయో లేదో చూడాలి. కొన్ని బాటిళ్లకు మినహాయించి, చాలా వరకు క్యాన్లకు ఇలాంటి వివరాలు ఉండవు. నీళ్లలోని అనవసరపు వ్యర్థాలు, మూలకాలను బయటకు పంపడానికి 5-6 వడపోత పద్ధతులు ఉంటాయి.

అల్ట్రావయొలెట్ కిరణాలను ఉపయోగించి నీళ్లలోని హానికరమైన సూక్ష్మజీవులను తొలగించడానికి యూవీ వడపోత పద్ధతిని వాడతారు. నీళ్లలోని ఖనిజాలు, ఉప్పు, ఇతర మలినాలను తొలగించే పద్ధతి ఆర్వో(రివర్స్ ఓస్మోసిస్) అని పిలుస్తారు. అలాగే మైక్రాన్ ఫిల్టర్లను కూడా వాడతారు. అయితే, క్యాన్ల ద్వారా పంపిణీ అయ్యే నీళ్లను ఒకసారి మాత్రమే ఫిల్టర్ చేస్తారు. నీళ్లను ఎలా ఫిల్టర్ చేస్తారో వినియోగదారులు తెలుసుకోవాలి. క్యాన్ వాటర్ సరఫరా చేసే కంపెనీకి లైసెన్స్ ఉందో లేదో కూడా వినియోగదారులు తెలుసుకోవాలి.