CM Revanth Reddy: దేశ సైన్యంతోనే మనమంతా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యం సామర్ధ్యాన్ని చూసి భారతీయుడిగా గర్వపడుతున్నానని..దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్,హోమ్ సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్,ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదన్నారు. అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని అధికారులకు సూచనలిచ్చారు. ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలని, మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని తెలిపారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లుగా తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలని, శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్దం చేసుకోవాలని, అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు. రెడ్ క్రాస్ వంటి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలన్నారు.

సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని, ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేయాలని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలన్నారు. హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలని, ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలని, హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram