Land Survey | సమగ్ర భూసర్వే ఏమైనట్లు..!
రాష్ట్రంలో భూ సర్వేకు 400 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా 33 గ్రామాల ఎంపిక 27 సర్వే ఏజెన్సీల నుంచి టెండర్లు ప్రతిపాదనల వద్దే పైలట్ ప్రాజెక్ట్ కేటాయించిన నిధులూ వాపస్ తాజాగా రూ.10 కోట్లు కేటాయింపు విధాత, హైదరాబాద్ ప్రతినిధి : 'మాటలు కోటలు దాటితే.. చేతలు తంగేళ్లు' దాటడం లేదన్న చందంగా ఉంది సమగ్ర భూ సర్వే (land survey) విషయంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వం చేసిన ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అమలు తీరుకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో […]

- రాష్ట్రంలో భూ సర్వేకు 400 కోట్లు
- రాష్ట్రవ్యాప్తంగా 33 గ్రామాల ఎంపిక
- 27 సర్వే ఏజెన్సీల నుంచి టెండర్లు
- ప్రతిపాదనల వద్దే పైలట్ ప్రాజెక్ట్
- కేటాయించిన నిధులూ వాపస్
- తాజాగా రూ.10 కోట్లు కేటాయింపు
విధాత, హైదరాబాద్ ప్రతినిధి : ‘మాటలు కోటలు దాటితే.. చేతలు తంగేళ్లు’ దాటడం లేదన్న చందంగా ఉంది సమగ్ర భూ సర్వే (land survey) విషయంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వం చేసిన ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అమలు తీరుకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో అధికారులతో పాటు ప్రజలు ఆయోమయంలో పడుతున్నారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం సమగ్ర భూ సర్వేతోనే సాధ్యమన్న కేసీఆర్.. ముందస్తుగా పలు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేస్తామని ప్రకటించారు. రూ.400 కోట్ల నిధులను కేటాయించారు. కానీ సమగ్ర భూసర్వే సంగతి అలా ఉంచితే.. కేటాయించిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు. దీంతో భూసర్వే పైలట్ ప్రాజెక్టుకు ప్రతిపాదనల వద్దే బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. ఇంత స్వల్ప మొత్తం కేటాయించడంతో సమగ్ర భూసర్వే ఉన్నట్లా? లేనట్టా అనే చర్చ రెవెన్యూ వర్గాల్లో మొదలైంది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో..
భూమి కొలతలో ఒక్క ఇంచు మందం కూడా తేడా రాకుండా భూ సర్వే చేయాలని ప్రభుత్వం గతంలో సూచించింది. దీంతో సర్వే నిపుణులు, అధికారులతో గతంలో సమీక్ష నిర్వహించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అక్షాంశాలను, రేఖాంశాలను అనుసంధానిస్తూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలోనే డీజీపీఎస్ (డిఫరెన్సియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం), హెచ్ఎర్ఎస్ఐ (హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్), సీఓఆర్ఎస్ (కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ సిస్టం), డ్రోన్స్, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు, హెలిక్యాప్టర్ల ద్వారా, రోవెల్స్ పరికరాలు, ఏరియల్ ఫొటోగ్రఫీ తదితర సాంకేతిక పద్ధతులపై సర్వే చేస్తే మేలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ముందు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు.
33 గ్రామాలు.. 27 ఏజెన్సీలు
పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రతి జిల్లాకు మూడు గ్రామాల చొప్పున 30 గ్రామాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో 3 గ్రామాలలో పైలట్ ప్రాజెక్టు కింద భూసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు 33 గ్రామాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు.
అనంతరం భూ సర్వేలో విశిష్ట అనుభవం ఉన్న సర్వే ఏజెన్సీల నుంచి రెండున్నరేళ్ల క్రితం టెండర్లు పిలిచి వివరాలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ఏండ్లు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోగా.. గతంలో ఇచ్చిన రూ.400 కోట్ల నిధులను కూడా వాపస్ తీసుకొని ఈ ఏడాది కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించడం అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిజాం కాలంలో జరిగినదే..
తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభుత్వం 1933లో సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఈ సర్వే 1956 వరకు కొనసాగిందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అనంతరం హైదరాబాద్ జిల్లాలో 1963 నుంచి 1975వ సంవత్సరం వరకు టౌన్ చేశారు. అనంతరం ఆంధ్రా సిస్టం ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా డివిజన్ సర్వే: చేసినప్పటికీ. అది అమల్లోకి రాకపోవడంతో.. నేటికీ నిజాం కాలంలో జరిగిన భూ సర్వే రికార్డులనే రెవెన్యూ. సర్వే సెటిల్‌మెంట్ శాఖల అధికారులు, తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్నది.