మావోయిస్టులపై అడవి ఏనుగు దాడి
కేరళ రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. మావోయిస్టుల బృందంపై ఓ అడవి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఒకరు గాయపడగా, మిగతా సభ్యులు దాని బారి నుంచి తప్పించుకున్నారు

- ఒకరికి గాయాలు.. పారిపోయిన కొందరు
- కేరళలోని కన్నూరు జిల్లాలో ఘటన
విధాత: కేరళ రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. మావోయిస్టుల బృందంపై ఓ అడవి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఒకరు గాయపడగా, మిగతా సభ్యులు దాని బారి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన కన్నూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఏనుగు దాడిలో గాయపడిన మావోయిస్టు సభ్యుడు సురేశ్‌ను దవాఖానకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు సభ్యుల మావోయిస్టు బృందం కంజిరకొల్లి చితారి కాలనీకి వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసింది. అనంతరం బృందం అడవిలోకి వెళ్తుండగా అడవి ఏనుగు ఈ బృందంపై దాడి చేసింది. కర్ణాటకలోని చిత్తమంగళూరుకు చెందిన సురేశ్ అనే దళ సభ్యులుడు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన మావోయిస్టు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నాడు. అతడిని పోలీసులు కన్నూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. గత ఐదేళ్లలో ఒక్క కేరళలో ఏనుగుల దాడిలో 107 మంది మరణించారు.