KTR : అధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర : కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్ల్యంతో తెలంగాణ వ్యాప్తంగా తాను వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

KTR :  అధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర : కేటీఆర్

KTR Pada Yatra..Next Year: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్ల్యంతో తెలంగాణ వ్యాప్తంగా తాను వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సన్నాహాలలో భాగంగా సూర్యాపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడు లాగా విజృంభించాలన్నారు. ఏప్రిల్ 27 నాడు వరంగల్ లో నిర్వహించే పార్టీ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా దానికి తొలి అడుగు పడాలని… ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాట నామ సంవత్సరంగా పాటించాలని కేడర్ కు పిలుపునిచ్చారు. ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలన్నారు. కాంగ్రెస్ , బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27 అని.. మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలని కోరారు.

మే నెలలో పార్టీ సంస్థాగత ప్రక్రియషురూ

వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందామని.. గ్రామస్థాయి వార్డు స్థాయి , బూత్ స్థాయి ,రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తామని.. వారికే అవకాశాలు ఇస్తామని.. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదని కేటీఆర్ తెలిపారు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తామని అన్నారు. చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని..ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదని.

ప్రశ్నించడం తట్టుకోలేకనే జగదీష్ రెడ్డి సస్పెన్షన్

శాసనసభ మన అందరిదీ అన్నందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ? అని మండిపడ్డారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవని.. స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్ కు ఎంతో గౌరవమని.. ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను స్పీకర్ ను అడ్డుపెట్టుకుని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని కేటీఆర్ విమర్శించారు. పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ గులాబీ దండు మాత్రమేనన్నారు.

ఢిల్లీకి మూటలు..కమిషన్ల ధ్యాసలోనే రేవంత్ రెడ్డి

ఢిల్లీకి మూటలు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్ కు ఏం లేదని..పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ఎద్దేవా చేశారు. యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతా అంటున్నాడన్నారు. 100కు 100% రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవులను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్ ని కాంగ్రెస్ నాయకులు ఎవరు స్వీకరించలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే ఖాతాల్లో టింగు టింగు మనీ పడుతున్నాయని ఆరోపించారు.

చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని..గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని..అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ లేకపోతే గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల పోరాటాలకు కేసీఆర్ నాయకత్వం తోడై విజయం సాధించామన్నారు. 25 ఏళ్ల పార్టీ చరిత్రలో మొదటి 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపించామని, అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయవచ్చో పదేండ్ల పాటుు చూపిస్తూ దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిన నాయకత్వం కేసీఆర్ ది అని కేటీఆర్ అన్నారు.

బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే

బడే భాయ్ మోడీ, చోటే బాయ్ రేవంత్ మధ్య అవగాహాన ఉందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు గొంతుగా బీఆర్ఎస్ ఉండొద్దని కాంగ్రెస్ , బీజేపీల ఉమ్మడి లక్ష్యం అని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ పక్షం కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పక్షం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు.