భారత్ మాతాకీ జై, జైహింద్ నినాదాలు ముస్లింలు ఇచ్చినవే
భారత్ మాతాకీ జై, జై హింద్ అని తొలుత నినదించింది ముస్లింలేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వాటిని వదిలేసేందుకు సంఘ్‌పరివార్ సిద్ధంగా ఉన్నదా? అని ప్రశ్నించారు.

- వాటిని సంఘ్‌పరివార్ వదిలేస్తుందా?
- కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్న
- ఉపనిషత్తులను పర్షియన్‌లోకి తర్జుమా చేయించిన షాజహాన్ కుమారుడు
- సంఘ్ నేతలు చరిత్ర తెలుసుకోవాలి
- ఎలక్టోరల్ బాండ్లపై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
మలప్పురం : భారత్ మాతాకీ జై, జై హింద్ అని తొలుత నినదించింది ముస్లింలేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వాటిని వదిలేసేందుకు సంఘ్‌పరివార్ సిద్ధంగా ఉన్నదా? అని ప్రశ్నించారు. ఉత్తర కేరళలో ముస్లింలు అధికంగా నివసించే మలప్పురం జిల్లాలో నిర్వహించిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో, స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం పాలకులు, సాంస్కృతిక చిహ్నాలు, అధికారులు గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. అజీముల్లాఖన్ అనే వ్యక్తి భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని మొదటగా ఇచ్చారని గుర్తు చేశారు.
‘ఇక్కడికి వచ్చిన కొందరు సంఘ్‌పరివార్ నాయకులు తమ ముందు కూర్చున్నవారిని భారత్ మాతాకీ జై అని నినదించాలని కోరారు. అసలు ఈ నినాదాన్ని మొదట ఇచ్చినది ఎవరు? ఆయన పేరు అజీముల్లాఖాన్ అని సంఘ్‌పరివార్ నాయకులు తెలుసో లేదో’ అని విజయన్ వ్యాఖ్యానించారు. ఈ నినాదాన్ని ఇచ్చింది ఒక ముస్లిం వ్యక్తి అని తెలిస్తే సంఘ్‌పరివార్ ఆ నినాదాన్ని వదిలేస్తుందేమోనని సందేహం వెలిబుచ్చారు. సీఏఏకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
మలప్పురంలో నిర్వహించినది ఈ క్రమంలో నాలుగవది. ఈ సభలో విజయన్ మాట్లాడుతూ.. జైహింద్ అనే నినాదాన్ని తొలుత లేవనెత్తింది అబిద్ హసన్ అనే పాత దౌత్యవేత్త అని చెప్పారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారా షిఖో దాదాపు 50 ఉపనిషత్తులను మూల భాష అయిన సంస్కృతం నుంచి పర్షియన్ భాషలోకి తర్జుమా చేయించారని, తద్వారా అవి విశ్వవ్యాప్తం అయ్యేందుకు దోహదం చేశారని తెలిపారు. భారత దేశం నుంచి ముస్లింలను పాకిస్థాన్‌కు వెళ్లగొట్టాలని చెబుతున్న సంఘ్‌పరివార్ నాయకులు ఈ చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలని సూచించారు. ఇతరులతోపాటే ముస్లింలు కూడా దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారని విజయన్ వివరించారు.
పోల్ బాండ్ల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే కేజ్రీవాల్ అరెస్ట్
ఎలక్టోరల్ బాండ్లను సీపీఎం ఎప్పుడూ స్వీకరించబోదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకూ చూడని అతిపెద్ద కుంభకోణం ఇదేనని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని విజయన్ విమర్శించారు. ‘ఎలక్టోరల్ బాండ్ల అంశం పెద్ద సమస్యను సృష్టిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, సంఘ్‌పరివార్‌కు తెలుసు. కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారు.
మన దేశం ఎటుపోతున్నదో చెప్పేందుకు ఇదొక సంకేతం. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనే ధోరణితో సంఘ్‌పరివార్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నది’ అని విజయన్ ఆరోపించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నదని చెప్పారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా దేశ చట్టాలకు తాము అతీతులమని, తమ అజెండా అమలు చేసేందుకు దేన్నీ వదలబోమని సందేశం ఇవ్వాలని ఆరెస్సెస్ చూస్తున్నదని అన్నారు.
సీఏఏ విషయంలో కాంగ్రెస్ వైఖరి సరిగ్గా లేదని విజయన్ స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఒకవైపు ప్రజలు ఆందోళనలు చేస్తుంటే.. కాంగ్రెస్ ఎంపీలు మాత్రం విందులలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. ‘ఈ నిరసనలు జరిగిన సమయంలో రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో అరెస్టయింది వామపక్ష నేతలే. ఆ సమయంలో అలప్పుళకు చెందిన మా ఎంపీ ఏఎం ఆరిఫ్ ఒక్కరే సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడేమో కాంగ్రెస్ నాయకులు తాము ఆ చట్టాన్ని సాంకేతికంగా వ్యతిరేకించామని చెప్పుకొంటున్నారు’ అని విజయన్ విమర్శించారు.