ఈనెల 4 నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు
పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15రోజుల పాటు జరుగనున్నాయి.

- 15 రోజుల పాటు సాగనున్న సమావేశాలు.. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
విధాత : పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15రోజుల పాటు జరుగనున్నాయి. సమావేశాల నిర్వాహణపై చర్చించేందుకు కేంద్రం శనివారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారధ్యంలో జరిగిన ఈ భేటీకి పలు పార్టీల పార్లమెంటు ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.
ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో తెలుగు రాష్ట్రాల వైసీపీ, బీఆరెస్ ఫ్లోర్ లీడర్లు మాత్రం సమావేశానికి హాజరుకాలేదు. అయితే టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ భేటీలో పాల్గొన్నారు. భేటీలో పార్లమెంటు శీతకాల సమావేశాలు సజావుగా కొనసాగేలా సహకరించాలని ప్రతిపక్షాలను రాజ్‌నాథ్ సింగ్ అభ్యర్ధించారు.
శీతకాల సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపచేసే ప్రయత్నం చేయనుందని సమాచారం. ప్రధానంగా ముగ్గురు ఎన్నికల కమిషనర్ల నియామం, కొత్త నేర శిక్షాస్మృతికి సంబంధించిన మూడు బిల్లులు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు తెలంగాణ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు సహా తదితర 24బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది.