Brazil | చనిపోయిందని సజీవంగా పూడ్చేశారు.. 11 రోజుల తర్వాత శవపేటిక తెరచి చూస్తే..
Brazil | విధాత: కాళ్ల నుంచి చేతుల వరకు సరిగ్గా సరిపోయే చిన్న పెట్టెలో ఉండిపోయి.. సాయం కోసం అర్థిస్తూ ఎవరూ రాక ప్రాణాలు కోల్పోవడం.. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా.. బ్రెజిల్ (Brazil) లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈశాన్య బ్రెజిల్‌లోని రిచాఓ దాస్ నెవాస్ నగరానికి చెందిన రోసంగేలా అల్మాండా (37) అనే మహిళకు గుండె పోటు రావడంతో మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబసభ్యులు ఆ […]

Brazil |
విధాత: కాళ్ల నుంచి చేతుల వరకు సరిగ్గా సరిపోయే చిన్న పెట్టెలో ఉండిపోయి.. సాయం కోసం అర్థిస్తూ ఎవరూ రాక ప్రాణాలు కోల్పోవడం.. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా.. బ్రెజిల్ (Brazil) లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈశాన్య బ్రెజిల్‌లోని రిచాఓ దాస్ నెవాస్ నగరానికి చెందిన రోసంగేలా అల్మాండా (37) అనే మహిళకు గుండె పోటు రావడంతో మరణించిందని వైద్యులు చెప్పారు.
దీంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబసభ్యులు ఆ దేహాన్ని శవపేటికలో పెట్టి సమాధి చేసేశారు. ఆ తర్వాత 10 రోజుల అనంతరం అటుగా వెళ్తున్న వారికి అందులోంచి శబ్దాలు రావడం, కాపాడమని అరుపులు వినపడటంతో వారు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.
అక్కడకి వచ్చి.. వారు శవపేటికను తెరచి చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది అక్కడే కూర్చుని గుండెలవిసేలా రోదించారు. శవపేటికలో పెట్టేటప్పుడు స్పృహలో లేని రోసంగేలా పూడ్చేసిన అనంతరం తెలివిలోకి (Alive in Coffin) వచ్చినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే తెలుస్తోంది.
శవ పేటిక తలుపును విరగ్గొట్టడానికి ఆమె విశ్వప్రయత్నం చేయడంతో మోకాళ్లకు, కాళ్లకు తీవ్ర గాయాలై కనిపించాయి. శవ పేటికకు కొట్టిన మేకులను తీసే ప్రయత్నంలో కొన్ని గోర్లు కూడా విరిగిపోయి కనిపించాయి. ఆ పెట్టి అంతా రక్తపు మరకలతో నిండిపోయింది.
ఆమెను బయటకు తీసిన వెంటనే అంబులెన్సులోకి తీసుకెళదామని ఒకరు, ప్రథమ చికిత్స అని మరొకరు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే శరీరం చల్లబడిపోయిందని.. ఇక ఆమె ప్రాణాలతో లేదని అక్కడే ఉన్న వైద్యులు నిర్ధరించారు. ఎవరూ కలలోకూడా ఊహించని దుర్భర స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయిందని వారు తెలిపారు.
అయితే ఆమెను పూడ్చిపెట్టిన తర్వాత ఎన్ని రోజులకు స్పృహలోకి వచ్చిందో స్పష్టత లేదు. రోసంగేలాకు ఎనిమిదేళ్ల నుంచే ఉన్నట్టుండి స్పృహ కోల్పోయే వ్యాధి ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయే ముందు ఆమెకు రెండు సార్లు గుండెపోటు వచ్చిందని.. తను చనిపోయిందని చెప్పాకనే దేహాన్ని పూడ్చిపెట్టామని వాపోయారు. ఈ ఘటన అనంతరం రోసంగేలా శవాన్ని తన స్వగ్రామానికి తీసుకెళ్లి మరోసారి ఖననం చేశారు.