Kanna Lakshminarayana |
విధాత: ఆరేడేళ్ల కిందటి కేసులో కన్నా (Court Shock to Kanna) కు ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంపై గృహ హింస కేసు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో రుజువైంది. కన్నా లక్ష్మీనారాయణ కోడలు శ్రీలక్ష్మీకీర్తి పెట్టిన ఈ కేసుపై విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శైలజదేవి మంగళవారం తీర్పు ఇచ్చారు.
కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు, శ్రీలక్ష్మీకీర్తి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆనతి నుంచి అత్త విజయలక్ష్మి, మామ లక్ష్మీనారాయణతో పాటు భర్త నాగరాజు వేధింపులకు పాల్పడుతున్నారని, వివాహం జరిగిన కొన్నేళ్ల వరకు పిల్లలు పుట్టక పోవడంతో భర్త నాగరాజు వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, తనను ఇంట్లోకి రానివ్వడంలేదని బాధితురాలు శ్రీలక్ష్మీకీర్తి కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు ఉన్నాళ్ళుగా కోర్టులో సాగుతూ వస్తోంది. అయితే మొత్తానికి ఇప్పటికి అది తేలింది. లక్ష్మీ నారాయణ కుటుంబం గృహ హింసకు పాల్పడిందని గతంలోనే మెట్రోపాలిటన్ కోర్టు లో రుజువైంది.
బాధితురాలు శ్రీలక్ష్మీకీర్తికి కన్నా కుటుంబం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, గృహ వసతి నిమిత్తం నెలకు రూ.50 వేలు చెల్లించాలని, లక్ష్మీకీర్తి కుమార్తె కౌశికి మానసకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు చెల్లించాలని మెట్రో పాలిటన్ కోర్టు గతంలో తీర్పు చెప్పింది.
ఈ తీర్పుపై కన్నా కుటుంబం అప్పీల్ కు వెళ్లింది. అయినా సరే వీరి అప్పీల్ ను మహిళా సెషన్స్ కోర్టు తోసిపుచ్చి మెట్రో పాలిటన్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్ధించింది. ఈ కేసు ఇప్పుడు కన్నా రాజకీయ అడుగులకు ప్రతిబంధకంగా మారింది. సత్తెనపల్లి నుంచి ఆయన TDP తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.