యూపీలో సినీఫక్కీలో క్రిమినల్స్ వేట!
యూపీలో సినీఫక్కీలో క్రిమినల్స్ వేట కొనసాగింది. కరుడుగట్టిన నేరస్థులను పట్టుకొనేందుకు పోలీస్ బృందం వెంటాడింది

- బుల్లెట్ గాయంతో యువ పోలీసు మృతి
- మహిళా కానిస్టేబుల్‌తో త్వరలో అతడి పెళ్లి
- పెండ్లి ఇంట్లో నెలకొన్న విషాదం
విధాత: యూపీలో సినీఫక్కీలో క్రిమినల్స్ వేట కొనసాగింది. కరుడుగట్టిన నేరస్థులను పట్టుకొనేందుకు పోలీస్ బృందం వెంటాడింది. క్రిమినల్స్ పోలీసులపైకి కాల్పులు జరుపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేశారు. సోమవారం రాత్రి గంటసేపు కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అదనపు పోలీసులు బలగాలను రప్పించి క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే. గాయపడిన యువ పోలీస్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడికి ఫిబ్రవరిలో వివాహం జరుగాల్సి ఉన్నది. ఇంతలో అతడి కుటుంబంలో విషాదం నెలకొన్నది.
అసలు ఏం జరిగిందంటే..
కన్నౌజ్‌లో నివాసం ఉండే అశోక్ యాదవ్ 20 హత్య కేసుల్లో నిందితుడు. కొన్నేండ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం రాత్రి అతడు ఇంట్లోనే ఉన్నాడని సమాచారం అందడంతో అరెస్టు చేయడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం వెళ్లింది. పోలీసుల రాకను ముందే పసిగట్టిన అశోక్ యాదవ్, అతని కుమారుడు అభయ్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వారు కాల్పులు జరుపడంతో ఒక బుల్లెట్ పోలీస్ కానిస్టేబుల్ రథి (30) తొడలోకి దూసుకెళ్లింది.
కాల్పులు తీవ్ర కావడంతో పోలీసు పార్టీ అదనపు బలగాలను రప్పించింది. నాలుగు పోలీసు స్టేషన్ల నుంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత యాదవ్ తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్ గాయమైన రథిని కాన్పూర్ దవాఖానకు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి రథి తుది శ్వాస విడిచాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన రథి 2019లో పోలీసు శాఖలో చేరారు. ఫిబ్రవరి 5న మహిళా కానిస్టేబుల్‌తో అతడి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి వేడుకలకు సిద్ధమైన కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది.