Nimesulide | ఈ పెయిన్ కిల్లర్ మాత్రల అధిక మోతాదుపై కేంద్రం నిషేధం
నిమెసులైడ్ 100 మి.గ్రాకు మించిన అధిక మోతాదు మాత్రల తయారీ, పంపిణీ, అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాలేయానికి ముప్పు, ప్రజారోగ్య భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.
Govt Bans High-Dose Nimesulide Above 100 mg Over Health Risks
- నిమెసులైడ్ అధిక మోతాదుతో ఆరోగ్యానికి ముప్పు
- 100ఎంజీ కంటే తక్కువ మోతాదులో వాడవచ్చు
- తక్షణమే అమల్లోకి వచ్చిన ఆంక్షలు
విధాత హెల్త్ డెస్క్ | హైదరాబాద్:
Nimesulide | దేశవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్న పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెసులైడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నోటి ద్వారా తీసుకునే (oral) 100 మిల్లీగ్రాములకంటే ఎక్కువ మోతాదు ఉన్న నిమెసులైడ్ మాత్రల తయారీ, విక్రయాలు, పంపిణీని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
డిసెంబర్ 29న జారీ చేయబడి, భారత రాజపత్రం(Gazette of India)లో ప్రచురించిన నోటిఫికేషన్‌లో, అధిక మోతాదులో నిమెసులైడ్ వినియోగం మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందని కేంద్రం తేల్చింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వినియోగం లేదా వైద్యుల పర్యవేక్షణ లేకుండా తీసుకున్నప్పుడు కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, నిమెసులైడ్‌కు బదులుగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయ నొప్పి నివారణ మందులు అందుబాటులో ఉన్నందున ప్రజాహిత దృష్ట్యా ఈ నిషేధం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
నిమెసులైడ్ ఒక నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్(NonSteroidal Anti-Inflammatory Drug – NSAID). జ్వరం, నొప్పి, వాపు తగ్గించేందుకు దశాబ్దాలుగా వాడుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ మందుపై దేశీయంగా, అంతర్జాతీయంగా ఆరోగ్యపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో ఈ ఔషధం నిములిడ్, నిమ్‌టెక్స్, నిసిప్, నైస్ వంటి బ్రాండ్ పేర్లతో విస్తృతంగా అమ్ముడవుతోంది.
ఐసీఎంఆర్, డీటీఏబీ సిఫార్సుల మూలంగా ఈ చర్య – తక్కువ మోతాదుపై లేదు

ఈ నిషేధానికి ప్రధాన ఆధారంగా Indian Council of Medical Research (ICMR) చేసిన సిఫార్సులు నిలిచాయి. ఐసీఎంఆర్ తాజా నివేదికలో, నిమెసులైడ్ అధిక మోతాదు వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా 18 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ మందు వాడకంపై పరిమితులు విధించాలని సూచించింది. అలాగే, 100 ఎంజీకి మించిన డోసు ఉన్న ఫార్ములేషన్లను పూర్తిగా నిషేధించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఔషధ సాంకేతిక సలహా మండలి (Drugs Technical Advisory Board – DTAB) తో విస్తృతంగా చర్చించింది. నిపుణుల అభిప్రాయాలు, వైద్య ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A ప్రకారం ఈ నిషేధాన్ని అమలు చేసింది. దీని ప్రకారం తయారీదారులు, పంపిణీదారులు, మెడికల్ షాపులు ఇకపై 100 ఎంజీకి మించిన ఇమిడియట్ రిలీజ్ నిమెసులైడ్ మాత్రలను తయారీ, నిల్వ, పంపిణీ లేదా విక్రయించడం చేయరాదు.
అయితే ప్రజలు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నిషేధం కేవలం 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదు ఉన్న మందులకే పరిమితం. 100 ఎంజీ లేదా అంతకంటే తక్కువ డోసు ఉన్న నిమెసులైడ్ మందులపై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఔషధ తయారీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న హై-డోసు నిమెసులైడ్ స్టాక్‌ను వెనక్కి రప్పించే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైద్య వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పుడు అధిక మోతాదు మందులతో రిస్క్ తీసుకోవడం అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిణామం మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది—వైద్యుల సలహా లేకుండా పెయిన్‌కిల్లర్లు వాడటం ప్రాణాలకు ముప్పు కావచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram