World’s First Nation Ban Smoking | 2007 తర్వాత పుట్టినవాళ్లకు అక్కడ పొగ తాగడం నిషిద్ధం!

2007 తర్వాత పుట్టినవాళ్లకు పొగాకు ఉత్పత్తులు వినియోగించడాన్ని నిషేధిస్తూ ఒక చిన్న దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉల్లంఘించేవారిపై భారీ జరిమానాలూ విధిస్తున్నది.

World’s First Nation Ban Smoking | 2007 తర్వాత పుట్టినవాళ్లకు అక్కడ పొగ తాగడం నిషిద్ధం!

World’s First Nation Ban Smoking | ఒక్కోసారి పెద్ద దేశాల కంటే చిన్నదేశాలే పెద్ద సందేశాలు ఇస్తుంటాయి. అ కోవలో ఒక చిన్న దేశం తాజాగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఆ దేశం తీసుకున్న నిర్ణయం ఆషామాషీ నిర్ణయం కాదు. ఒక విధంగా దశలవారీగా యావత్‌ దేశంలో పొగ తాగడాన్ని నిషేధించే బృహత్‌ సంకల్పం. ఈ ఆధునిక ప్రపంచంలో సిగరెట్‌ తాగడం ఒక వయసు వచ్చినవాళ్లు అవసరంగా భావిస్తుంటే.. యువత మాత్రం దానిని ఫ్యాషన్‌గానే భావిస్తున్నది. నోట్లో సిగరెట్‌ పెట్టుకుని గుప్పుగుప్పున పొగలు వదిలి తమ హీరోయిజాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు సిగరెట్‌ తాగుతున్న మధ్య వయస్కులు, పెద్ద వయస్కుల్లో చాలా మంది ఇలా సరదాగా ఈ దురలవాటుకు అలవాటైనవాళ్లేననడంలో సందేహం లేదు. పొగ తాగడాన్ని మాన్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాల్లో భయానకమైన క్యాన్సర్‌ రోగుల బొమ్మలను సిగరెట్‌ పెట్టెలపై ముద్రిస్తూ.. ధూమపానం ప్రాణాంతకం అని రాస్తున్నారు. అయినా.. సిగరెట్‌ తాగేవాళ్ల సంఖ్య తగ్గినట్టు ఆధారాలేమీ లేవు. ఇదొక వ్యవస్థాగత సమస్యగా తయారై కూర్చున్నది. దీనికి ఒక చిన్న దేశం గొప్ప పరిష్కారాన్ని కనుగొన్నది. అదేమంటే.. ఆ దేశంలో 2007 తర్వాత పుట్టిన ఎవ్వరూ పొగతాగరాదు. అది వారికి నిషిద్ధం. అంతేకాదు.. తమ దేశానికి వచ్చిన పర్యాటకుల్లో 2007 తర్వాత పుట్టిన వాళ్లుంటే.. ఈ నిబంధన వారికి సైతం వర్తిస్తుంది.

ఇంతా చేసి ఆ దేశం జనాభా.. సుమారు 5 లక్షల 30వేలు. కానీ.. ప్రపంచంలోనే ఒక మొత్తం తరానికి పొగతాగాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. ఈ ఆసక్తికర, తెలివైన నిర్ణయం తీసుకున్న దేశం.. మాల్దీవులు. భారతదేశానికి సమీపంలో ఉండే ఓ చిన్న దీవుల సముదాయ దేశం. సుమారు 1100 కోరల్‌ ఐలాండ్స్‌ సమూహం. హిందూ మహా సముద్రంలోని ఈ దేశం.. లగ్జరీ రిసార్టులకు ప్రఖ్యాతిగాంచింది. ప్రధానంగా టూరిస్టులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 2007 జనవరి 1 తర్వాత పుట్టినవారెవరైనా పొగతాగడం నిషిద్ధం. ఈ కొత్త నిబంధన 2025, నవంబర్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ దేశానికి పర్యాటకులుగా వచ్చేవారికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

ఈ నిర్ణయం ద్వారా ఈ రకమైన చర్య తీసుకున్న తొలి దేశంగా మాల్దీవులు ప్రఖ్యాతి పొందింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశాధ్యక్షుడు ముహ్మద్‌ ముయిజ్జు తీసుకుంటున్న విస్తృత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. 2007 ఆ తర్వాత పుట్టినవాళ్లకు సిగరెట్లు అమ్మడం, వాడకం నిషిద్ధం. అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపైనా ఇది వర్తిస్తుందని ఆ దేశ ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, టుబాకో రహిత తరాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తారు. నిషిద్ధ ఏజ్‌ గ్రూప్‌ల వారికి సిగరెట్లు విక్రయించిన దుకాణదారులకు 50వేల మాల్దీవియన్‌ కరెన్సీ రుఫియా జరిమానా విధిస్తారు. అంటే భారత కరెన్సీలో సుమారు 2 లక్షల 88వేలు. నిర్దిష్ట వయో పరిమితిలోపు వారు సిగరెట్లు కాల్చినట్టు కనిపిస్తే వారిపై 5వేల రూఫియా అంటే సుమారు 28వేలు ఫైన్‌ వేస్తారు. 2022లో న్యూజీలాండ్‌ సైతం ఇటువంటి చట్టం తీసుకొచ్చినా.. తదుపరి ప్రభుత్వం ఏడాదిలోపే దానిని రద్దు చేసింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సైతం ఇటువంటి ఆలోచన చేస్తున్నది. 2009 తర్వాత పుట్టినవారికి పొగతాగడాన్ని నిషేధించే ప్రణాళికల్లో ఉన్నది. ఈ మేరకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నది.