IIT Graduate | అమెరికాలో లక్షల జీతం.. లగ్జరీ లైఫ్ వదిలేసి.. ఫ్యామిలీతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఐఐటీయన్..!
IIT Graduate | ఐఐటీ గ్రాడ్యుయేట్ అమెరికాలో లక్షల్లో జీతం వచ్చే జాబ్ వదిలేసి, 4BHK ఇంటిని అమ్మేసి ప్రపంచ యాత్రకు బయల్దేరాడు. ఈ జర్నీలో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భార్య, ముగ్గురు పిల్లలతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న అతని కథ ఇప్పుడు వైరల్‌గా మారింది.
IIT Graduate | లక్షల్లో జీతం.. లగ్జరీ లైఫ్.. సాధారంగా యువత కోరుకునేది ఇదే..! కానీ ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ మాత్రం వాటన్నింటికీ మించి ఇంకా వేరే ఏదో కావాలనుకున్నాడు. అందుకే అమెరికాలో భారీ జీతంతో ఉన్న ఉద్యోగం వదిలేసి, 4BHK ఇంటిని అమ్మేసి.. ప్రపంచాన్ని చుట్టేయడానికి బయల్దేరాడు. ఈ ప్రయాణంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి తన ప్రపంచ యాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. సంపాదన వెనుక పరుగులు పెడుతున్న నేటి యువతను ఈ ఐఐటీయన్ కథ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది.
ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్ కథను హ్యూమన్ ఆఫ్ బాంబే ప్రచురించింది. అతని పేరు బయటపెట్టకుండా అతని జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని వివరించింది. దీని ప్రకారం.. ఓ యువకుడు 2003లో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ అమెరికా వెళ్లి బ్యాంకింగ్ రంగంలో మంచి కెరీర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా ఎదుగుతూ 38 ఏళ్ల వయసు వచ్చేసరికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. చాలామంది యువకులు కలలు కనే స్థాయికి ఎదిగి, లక్షల్లో జీతం వస్తున్నప్పటికీ అతని మనసులో ఏదో వెలితిగా ఉండేది. ఎంతసేపు సంపాదన, కెరీర్ అంటూ పరుగులు పెడుతుంటే.. ఏదో కోల్పోతున్నట్లుగా భావించాడు. అందుకే దాదాపు పదేళ్ల పాటు కొనసాగిన తన రొటిన్ జీవితాన్ని స్వస్తి పలకాలని అనుకున్నాడు.
2013లో ఎవరూ ఊహించని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. లక్షల జీతం వచ్చే బ్యాంక్ జాబ్‌ను వదిలేశాడు. అమెరికాలో తనకు ఉన్న 4BHK ఇంటిని అమ్మేశాడు. భుజానికి ఒక బ్యాక్‌ప్యాక్ వేసుకుని ప్రపంచ యాత్రకు బయల్దేరాడు. అలా 18 నెలలు ఒంటరిగానే 35 దేశాలు తిరిగాడు. రష్యా పర్వతాల నుంచి ఈజిప్ట్ ఎడారుల వరకు చుట్టివ చ్చాడు. అక్కడి సంస్కృతుల గురించి, కొత్త జీవితాల గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో నాకు నేనే ఏంటో తెలుసుకున్నా అని సదరు ఐఐటీయన్ గుర్తుచేసుకుంటుంటాడు.
అలా ప్రపంచ యాత్ర చేస్తున్న సమయంలోనే మాంటెనెగ్రోలో కేథీ అనే ఆస్ట్రేలియాకు చెందిన యువతితో అతనికి పరిచయమైంది. ఒక చిన్న హాస్టల్‌లో మొదలైన వారి పరిచయం ఇద్దరి జీవితాన్ని మలుపు తిప్పింది. ఇద్దరూ కేవలం 10 నిమిషాలే మాట్లాడుకున్నారు.. కానీ అదే తర్వాత 10 రోజులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గర చేసింది. ఆ 10 రోజుల తర్వాత ఆమె వెళ్లా్ల్సిన సమయం వచ్చింది. అప్పుడే ఆమెతో పరిచయాన్ని అక్కడికే ఆపేయాలని అనుకున్నాడు. కానీ ఆమెను విడిచి రెండు రోజులు మాత్రమే ఉండగలిగాడు. కేథీ లేని జీవితం ఊహించుకోలేక.. ఆమెను కలిసేందుకు వెళ్లి తన లవ్‌ను ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కేథీని ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. 2016లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాదాపు 12 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తూనే ఉన్నారు.
ఈ జర్నీలోనే ఈ ఐఐటియన్ జంటకు ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. వాళ్లు మాత్రం ఈ ట్రావెల్ లైఫ్‌స్టైల్‌లోనే పెరిగారు. మెడిసిన్స్, డైపర్స్ లేకుండా వారిని సహజంగా పెంచుతున్నామని.. వేదాలు, ఉపనిషత్తులు, NCERT పుస్తకాలతో హోమ్ స్కూలింగ్ అందిస్తున్నామని ఈ ఐఐటియన్ చెబుతుంటారు. జీవితం అంటే పదవులు అందుకోవడం కాదు.. మనం ఎవరో తెలుసుకోవడమే ముఖ్యమని తమ పిల్లలకు నేర్పిస్తున్నామని అంటున్నారు. అందుకే సాధారణ హోమ్‌స్టేలో ఉంటూ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని చెబుతుంటారు.
View this post on Instagram
ఇలా జాబ్ వదిలేసి కుటుంబంతో కలిసి తిరగడానికి వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సందేహం రావచ్చు. దానికి కూడా ఐఐటీయన్ క్లారిటీ ఇచ్చాడు. ఇండియాలో తాను పెట్టిన పెట్టుబడులతో వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నామని చెప్పాడు. పాత జాబ్‌లో ఉన్న సెక్యూరిటీని మిస్సవుతున్నావా? అని చాలామంది తనను అడుగుతున్నారని కూడా తెలిపాడు. అయితే 4BHK జీవితాన్ని వదిలేసి ప్రపంచమే ఇల్లుగా బతుకుతున్నానని బదులిస్తున్నానని అన్నాడు. నిజంగా రాజుల్లా జీవిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి కెరీర్, సంపాదన అంటూ లక్ష్యాలు పెట్టుకుని పరిగెడుతున్న నేటి యువతను.. ఈ ఐఐటీయన్ కథ ఇప్పుడు ఆలోచనల్లో పడేస్తోంది.
Read More :
six tigers crossing road| అరుదైన అద్బుతం..ఒకేసారి రోడ్డుపై ఆరు పులులు
Teacher Brutality| విద్యార్థిపై ఉపాధ్యాయుడి అమానుషం!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram