కేర‌ళ‌లో భారీ పేలుడు.. ఒక‌రి మృతి.. ఉగ్ర‌దాడిగా అనుమానం

కేర‌ళ‌లో భారీ పేలుడు.. ఒక‌రి మృతి.. ఉగ్ర‌దాడిగా అనుమానం

కేర‌ళ‌ (Kerala Blast) లో భారీ వ‌రుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో క‌నీసం ఒక‌రు చ‌నిపోగా.. 40 మందికి పైగా గాయాల‌య్యాయి. ఎర్నాకుళం జిల్లాలోని కాలామేస‌రీ లో ఉన్న ఒక క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఈ పేలుడు జ‌రిగింది. పోలీసులు దీనిని ఉగ్ర‌వాదుల దాడిగా అనుమానిస్తున్నారు. జీవీవా సాక్ష్యం పేరుతో జ‌రుగుతున్న మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మంలో వ‌రుస పేలుళ్లు సంభ‌వించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు తెలిపారు.


ఘ‌ట‌న జ‌రిగిన‌పుడు అక్క‌డ 2000 వేల మంది ఉన్నార‌ని, గాయ‌ప‌డిన వారి సంఖ్య పెర‌గ‌వ‌చ్చొని తెలుస్తోంది. ఉగ్ర‌వాది దాడి అని ఇంచుమించు నిర్ధార‌ణ‌కు రావ‌డంతో ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నాయి. జీవోవా సాక్ష్యం అనేది క్రైస్తవుల్లో ఒక గ్రూప్‌. కానీ వారిని వారు ప్రొటెస్టంట్ల‌గా భావించుకోరు. ఈ జీవోవా స‌మూహం వారు ఏడాదికోసారి స‌మావేశ‌మై.. శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు మూడురోజుల పాటు ప్రార్థ‌న‌లు నిర్వ‌హించుకుంటారు.


క్రైస్త‌వుల‌తో క‌ల‌వ‌ని వీరిపైన ఆ మ‌త వ‌ర్గాల‌లోనే తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని పలువురు ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. సంఖ్య‌ప‌రంగా చూసుకుంటే వీరి సంఖ్య త‌క్కువ‌ని.. అందుకే సులువుగా ల‌క్ష్య‌మ‌వుతార‌ని తెలిపారు. శ‌నివారం కేర‌ళ‌లోనే జ‌రిగిన ఒక కార్య‌క్రమంలో హ‌మాస్ నాయ‌కుడు ఒక‌రు వ‌ర్చువ‌ల్‌గా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


బాంబు దాడికి ఇదీ ఒక కార‌ణ‌మా అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు సాగుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ విచారం వ్య‌క్తం చేశారు. ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ దాడిని ఖండించారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. దాడిప‌ట్ల విచారం వ్య‌క్తం చేసిన బీజేపీ.. కేర‌ళ‌లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు ప‌డిపోతున్నాయ‌ని విమ‌ర్శించింది. 


వ్య‌క్తి లొంగుబాటు

ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ ఒక వ్య‌క్తి త్రిశూర్‌లోని కొడాక్రా పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. డొమినిక్ మార్టిన్ అనే వ్య‌క్తి త‌మ లొంగిపోయిన‌ట్టు కేర‌ళ పోలీసులు తెలిపారు. ఆయ‌న కొన్ని సాక్ష్యాధారాలు స‌మ‌ర్పించాడ‌ని, వాటిని తాము ప‌రిశీలిస్తున్నామ‌ని పేర్కొన్నారు. జెహోవాస్ విట్‌నెస్ చ‌ర్చి స‌భ్యుడిగా చెప్పుకొన్నాడ‌డ‌ని తెలిపారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.