కేరళ సీఎం పినరయ్‌కు హత్యా బెదిరింపులు

- రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్‌కు ఫోన్ కాల్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. అగంతకుల నుంచి బుధవారం సాయంత్రం పోలీస్ హెడ్ క్వార్టర్ లోని కంట్రోల్ రూమ్ కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని గురువారం పోలీసులు మీడియాకు తెలియజేశారు. మైనర్ బాలుడి నుండి ఈ ఫోన్ కాల్ వచ్చిందని వార్తల్లో వచ్చిన విషయాన్ని విలేకరులు పోలీసులతో ప్రస్తావించగా, మేము ఈ విషయాన్నిఅన్ని కోణాల నుండి పరిశీలిస్తున్నామని తెలియజేశారు.
అయితే ఈ విషయంపై మ్యూజియమ్ పోలీస్ స్టేషన్ లో 118(బీ), 120(0) కేరళ పోలీసు చట్టం సెక్షన్ ల కింద కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెక్షన్118(బీ).. వదంతులను వ్యాప్తి చేయటం లేదా పోలీసులను పక్కదారి పట్టించేందుకు అనవసరపు కాల్స్ చేస్తుండటం, 120(0) సెక్షన్.. ఎవరైనా ఇతరులకు అనవసరపు మెసేజ్ ల ద్వారా ఇబ్బందిపెడుతూ కాల్స్ చేయడం, ప్రస్తుతం పోలీసులు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.