3వేల లైంగిక కార్యకలాపాల పెన్‌డ్రైవ్‌ అందింది

మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వేల్‌ రేవణ్ణపై లైంగిక దాడి ఆరోపణలు కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్నాయి. ఇప్పటికే రేవణ్ణ బెంగళూరు నుంచి ఆదివారమే ఫ్రాంక్‌ఫర్ట్‌కు పరారయ్యారు

3వేల లైంగిక కార్యకలాపాల పెన్‌డ్రైవ్‌ అందింది
  • ప్రజ్వల్‌ రేవణ్ణపై బీజేపీ కర్ణాటక నేత సంచలన ఆరోపణ
  • వాటిని ఉపయోగించుకుని మహిళలపై అరాచకాలు
  • గతేడాది డిసెంబర్‌లోనే పార్టీ అధ్యక్షుడికి చెప్పానన్న దేవెరాజె గౌడ

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వేల్‌ రేవణ్ణపై లైంగిక దాడి ఆరోపణలు కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్నాయి. ఇప్పటికే రేవణ్ణ బెంగళూరు నుంచి ఆదివారమే ఫ్రాంక్‌ఫర్ట్‌కు పరారయ్యారు. మరోవైపు జేడీఎస్‌తో బీజేపీ పొత్తును ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ నిలదీస్తున్నది. ఇదిలా ఉంటే.. ప్రజ్వల్‌ రేవణ్ణకు వ్యతిరేకంగా మహిళలకు సంబంధించిన మూడువేలకు పైగా అసభ్య వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ తనకు అందినట్టు గత ఏడాది డిసెంబర్‌లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పానని బీజేపీ కర్ణాటక నేత దేవెరాజె గౌడ చెప్పిన అంశం సంచలనం రేపుతున్నది. ఈ వీడియోలన్నీ పలువురు ప్రభుత్వ అధికారిణులు సహా మహిళలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో చిత్రీకరించినవి. ఈ వీడియోలను చూపించి మహిళలను ప్రజ్వల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి, అటువంటి కార్యకలాపాలను కొనసాగించాడని దేవెరాజె గౌడ చెప్పారు. ప్రజ్వల్‌ మొన్న ఏప్రిల్‌ 26న జరిగిన హసన్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రజ్వల్‌ ఆదివారం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ వెళ్లిపోయారని ఒక చానల్‌ పేర్కొన్న నేపథ్యంలో దేవెరాజె గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అసభ్య వీడియోలపై దర్యాప్తు చేసేందుకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ప్రజ్వల్‌ ముందే దేశం వదిలి వెళ్లిపోయారని తెలుస్తున్నది.

తన లేఖలో దేవెరాజె గౌడ ఏం చెప్పారు?
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రకు రాసిన లేఖలో దేవెరాజె గౌడ అనేక సంచలన అంశాలు ప్రస్తావించారు. ప్రజ్వల్ రేవణ్ణతోపాటు దేవెగౌడ కుటుంబ సభ్యులు, పలువురు జేడీఎస్‌ నేతలపై తీవ్ర అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు అందిన పెన్‌డ్రైవ్‌లో మొత్తం 2,976 వీడియోలు ఉంటే.. అందులో కొన్ని ప్రభుత్వ మహిళా అధికారులవి కూడా ఉన్నాయని తెలిపారు. ఈ వీడియోలు, ఫొటోలతో కూడిన మరో పెన్‌డ్రైవ్‌ కాంగ్రెస్‌ జాతీయ నాయకులకు అందిందని పేర్కొన్నారు. ‘మనం జేడీఎస్‌తో మళ్లీ పొత్తు పెట్టుకున్నా, లేదా జేడీఎస్‌ అభ్యర్థిని హసన్‌ సీటు నుంచి నామినేట్‌ చేసినా ఈ వీడియోలు బ్రహ్మాస్త్రాలుగా మారుతాయి. రేపిస్టు ఉన్న కుటుంబంతో మనం పొత్తు పెట్టుకున్నామనే అపప్రథ మనమీద పడుతుంది. దేశవ్యాప్తంగా మన పార్టీ ప్రతిష్ఠకు ఇది పెద్ద విఘాతంగా మారుతుంది’ అని లేఖలో తెలిపారు.

ప్రజ్వల్‌, రేవణ్ణలను పార్టీ నుంచి తొలగించాలి
హసన్‌ నుంచి ప్రజ్వల్‌ పోటీపై ఆందోళన వ్యక్తం చేసింది ఒక్క దేవెరాజె గౌడ మాత్రమే కాదు. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి తొలగించాలని జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణ్‌గౌడ కందుకుర్‌ శనివారం అధినేత దేవెగౌడకు లేఖ కూడా రాశారు. ఈ లైంగిక వీడియోల కుంభకోణం పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించిందని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా ఈ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సర్క్యులేట్‌ అవుతున్నాయని ఆయన తన లేఖలో తెలిపారు. కొన్ని వీడియోల్లో ప్రజ్వల్‌ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. మొత్తంగా ఆయన నిందితుడిగా కనిపిస్తున్నదన్నారు. కాబట్టి తక్షణమే ఆయనను పార్టీ నుంచి తొలగించాలని లేఖలో కోరారు. జేడీఎస్‌ మరో ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ కూడా ప్రజ్వల్‌ను, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యకర్తలను ఈ కేసు తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో దేవెగౌడ, కుమారస్వామి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమా? లేక హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్‌ ముఖ్యమా అనేది నిర్ణయించుకోవాలని అన్నారు. పార్టీ నుంచి ఆ ఇద్దరినీ 24 గంటల్లోగా తొలగించి, తమను ఇబ్బందికర పరిస్థితి నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు.

కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా..
ప్రజ్వల్‌ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఒక 47 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్‌, రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పడంతో ప్రజ్వల్‌ రేవణ్ణ చుట్టూ వివాదం ముసురుకున్నది. తన కుమార్తెతో కూడా ప్రజ్వల్‌ అసభ్యంగా మాట్లాడేందుకు ప్రయత్నించారని, దీంతో ఆయన నంబర్‌ను తన కుమార్తె బ్లాక్‌ చేసిందని ఆమె తెలిపారు.
‘నేను పనిలో చేరిన నాలుగు నెలల తర్వాత రేవణ్ణ తన గదికి పిలుస్తూ ఉండేవాడు. ఆ ఇంట్లో మొత్తం ఆరుగురు మహిళలు పనిచేస్తున్నారు. ప్రజ్వల్‌ ఇంటికి వచ్చిన సమయంలో తాము భయపడుతుంటామని ప్రతి ఒక్కరూ చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరించారు’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘హెచ్‌డీ రేవణ్ణ భార్య ఇంట్లో లేనప్పుడల్లా మహిళలను స్టోర్‌రూమ్‌లోకి పిలిచి, పళ్లు ఇచ్చే నెపంతో వారిని తాకేవాడు. వారి చీర పిన్నులు తీయడంతోపాటు వారిపై లైంగిక దాడి చేసేవారు’ అని ఆమె తెలిపారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ 354ఏ, 354డీ, 506, 509 కింద కేసు నమోదు చేశారు.