Atishi sworn in । ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశి ప్రమాణానికి ముహూర్తం ఖరారు
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం శనివారం కొలువుదీరనున్నది. ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిశి ప్రమాణం స్వీకరించనున్నారు. ఆమెతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Atishi sworn in । ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత అతిశి (Atishi) శనివారం (సెప్టెంబర్ 21, 2024) ఢిల్లీ ముఖ్యమంత్రిగా (chief minister of Delhi) ప్రమాణం చేయనున్నారు. అతిశితోపాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని ఆప్ నేతలు గురువారం ప్రకటించారు. తొలుత అతిశి ఒక్కరే ప్రమాణం (sworn in) చేస్తారని భావించినా.. కొందరు మంత్రులతో కూడా ప్రమాణం చేయించాలని ఆప్ వర్గాలు భావించినట్టు తెలిసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను (V.K. Saxena) కలిసిన కేజ్రీవాల్.. తన రాజీనామా పత్రాన్ని అందించారు. గవర్నర్‌ను కలిసిన ఆప్ నేతల్లో అతిశి కూడా ఉన్నారు. అదే సమావేశంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీకి అతిశి మూడో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు. శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న అతిశి.. 2025 ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వరకు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తన అధికారిక నివాసాన్ని కేజ్రీవాల్ 15 రోజులలో ఖాళీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన భద్రతను కూడా ఆయన ఉపసంహరించుకుంటారని పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్య మంత్రి పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తాను ప్రజాకోర్టుకు వెళతానని, ప్రజలు మళ్ళీ తనను గెలిపిస్తేనే ముఖ్యమంత్రి పదవిని చేపడుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అతిశయి కీలకమైన ఆర్థిక శాఖ విద్యాశాఖ రెవెన్యూ సహా అనేక ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న కాలంలో పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో అతిశి ఇతర నాయకులతో కలిసి కృషి చేశారు.