Delhi Chief Minister । ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశి.. నేటి సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా
కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు మంగళవారం ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అతిశి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. దీనికి ఆప్ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా తమ ఆమోదం తెలిపారు.

Delhi Chief Minister । ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలను ఆప్ నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అతిశి (Atishi) చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు షరతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడం వీలుకాని కారణంగా ఆ పదవికి రాజీనామా చేయనున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతలు కొత్త నాయకుడిని మంగళవారం ఎన్నుకున్నారు. మంగళవారం సాయత్రం ముఖ్యమంత్రి పదవికి కజ్రీవాల్ రాజీనామా సమర్పించనున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అతిశి అవకాశం కోరనున్నారు. తమ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నట్టు ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ కమిటీ కన్వీనర్ గోపాల్ రాయ్ (Gopal Rai) చెప్పారు. అతిశి నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతామని తెలిపారు. క్యాబినెట్‌లో ఎవరెవరు ఉండాలనేది తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
కేజ్రీవాల్ ప్రభుత్వంలో అతిశి ఆర్థిక, విద్య, ప్రజాపనులు వంటి కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు మంగళవారం ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అతిశి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. దీనికి ఆప్ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా తమ ఆమోదం తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతకు అంతకు ముందు అతిశి పేరుతోపాటు మంత్రులు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ ఛద్దా, కేజ్రీవాల్ భార్య సునీత, అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్లపై మీడియాలో చర్చలు నడిచాయి. చివరకు అతిశిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
ఈ నిర్ణయానికి ముందు కేజ్రీవాల్ పార్టీ ముఖ్యనేతలతో ముఖాముఖి చర్చలు జరిపినట్టు సమాచారం. వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అతిశి పేరును ప్రతిపాదించారని తెలిసింది.