వందే భారత్ జర్నీ ఓ అద్బుతం : సోనూ సూద్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన సోనూ సూద్ ఈ జర్నీ అద్భుతమని కొనియాడారు. రైలు సౌకర్యాలు, ఆహారం, సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ భారతీయ రైల్వేలకు కృతజ్ఞతలు తెలిపారు.

బాలివుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ తన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన సోనూసూద్..ఈ ప్రయాణం అద్బుతంగా ఉందని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు. ఒకప్పుడు రైళ్లలో రిజర్వేషన్ దొరక్క.. న్యూస్‌పేపర్లు పరుచుకుని పడుకున్నా” అంటూ తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు.

నాటి రోజులతో పోలిస్తే నేడు రైల్వే వ్యవస్థ ఎంతో అద్భుతంగా మారిందంటూ వందేభారత్ జర్నీపై నటుడి హర్షం వ్యక్తం చేశారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందిస్తున్న నాణ్యమైన ఆహారం, రైల్వే సిబ్బంది అద్భుతమైన సేవలను సోనుసూద్ ఈ సందర్బంగా ప్రశంసించారు. సామాన్య భారతీయుల ప్రయాణ నాణ్యతను పెంచినందుకు ధన్య వాదాలు అంటూ రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోను షేర్ చేశారు.

వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 కు పైగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ మార్గాలలో విజయవంతంగా నడుస్తున్నాయి. చాలవరకు 100శాతం అక్యూపెన్సీతో నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లు భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన, ఆధునిక రైళ్లు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించగలవు. వందే భారత్ రైళ్లలో ఎయిర్ కండిషనింగ్, వై-ఫై, పవర్ సాకెట్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి (ముఖ్యంగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య) ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ – తిరుపతి మరియు నాగ్‌పూర్ – సికింద్రాబాద్ రూట్లలో కూడా వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణీకుల డిమాండ్ మేరకు, రాత్రి ప్రయాణాల సౌకర్యం కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు నడవనున్నాయి. తొలి విడతలో రెండు రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఒకటి, విజయవాడ నుంచి బెంగళూరుకు మరొక రైలు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్-ఢిల్లీ మార్గం రైలు ఛార్జీలు కూడా నిర్ణయించారు. విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కూడా రైలు నడిపే ఆలోచనలో ఉన్నారు.

త్వరలో బుల్లెట్ ట్రైన్

దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి రైలును ప్రారంభించాలని కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. తొలి బుల్లెట్ ట్రైన్ ఈ మార్గంలోనే రానుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా 2027, ఆగస్ట్ 15న తొలి రైలును ఈ మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబై-అహ్మదాబాద్ మధ్య రెండు గంటల్లోపే చేరుకోవచ్చు.

ఇక ముంబై-పుణె-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ లో మరో బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. ప్రస్తుతం రైళ్లలో సుమారు 15 గంటలు పడుతోంది, రోడ్డులో సుమారు 12 గంటలు పడుతోంది. కొత్త బుల్లెట్ ట్రైన్ వల్ల ఈ ప్రయాణం 3 గంటల లోపే పూర్తవుతుంది. ఈ మార్గం మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఇది మూడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. తెలంగాణలో సుమారు 93 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, మహారాష్ట్రలో పెద్ద భాగం 457 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బుల్లెట్ ట్రైన్ వేగం సుమారు 300 కిలోమీటర్లు పర్ అవర్. ఇప్పటి ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే దాదాపు ఐదు రెట్లు వేగం.

Latest News