NDA in Tamilnadu | త‌మిళ‌నాట క‌మ‌లానికి తోడైన రెండాకులు

ఎన్డీయేలోకి అన్నాడీఎంకే మళ్లీ రావడంపై కొద్దివారాలుగా సాగుతున్న చర్చల ప్రక్రియకు అమిత్ షా ప్రకటనతో తెరపడింది. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా కూటమి పనిచేస్తుందని అమిత్‌షా చెప్పడంతో కీలక అంశాలపై విభేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టి ఉమ్మడి అజెండాతో పనిచేయనున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి.

NDA in Tamilnadu | త‌మిళ‌నాట క‌మ‌లానికి తోడైన రెండాకులు
  • రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు
  • అధికారికంగా ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి అమిత్‌షా
  • రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి అన్నామ‌లై తొలగింపు
  • కీల‌క డిమాండ్ నెర‌వేర్చుకున్న అన్నాడీఎంకే
  • కూట‌మికి నాయ‌క‌త్వం వ‌హించేది ఈపీఎస్‌
  • స్ప‌ష్ట‌త‌నిచ్చిన హోం మంత్రి అమిత్‌షా

NDA in Tamilnadu | 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, అన్నా డీఎంకే క‌లిసి పోటీచేస్తాయ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. గ‌త కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల పొత్తుపై తీవ్ర స్థాయిలో చ‌ర్చలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడులో ఎన్డీయే కూట‌మికి అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎడ‌ప్పాడి కే ప‌ళ‌నిస్వామి (EPS) సార‌థ్యం వ‌హిస్తార‌ని అమిత్‌షా స్ప‌ష్ట‌త‌నిచ్చారు. రెండు పార్టీలూ క‌లిసి క‌నీస ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తాయ‌ని చెప్పారు. ‘తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య కూటమి ఈపీఎస్ నాయకత్వంలో ఉంటుంది’ అని అమిత్‌షా చెప్పారు. ఈ ప్రకటన చేసిన సమయంలో వేదికపై ఈపీఎస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఉన్నారు. అయితే.. ఈ ప్రకటన వెలువడిన తర్వాత బీజేపీ తన అధ్యక్షుడిని కూడా మార్చివేయడం గమనార్హం. ఈపీఎస్ కీల‌క డిమాండ్ల‌లో అన్నామ‌లైని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను త‌ప్పించ‌డం ఒక‌ట‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అది క్లియ‌ర్ అవ‌డంతోనే కూట‌మి ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయింద‌ని అంటున్నారు.

ఎన్డీయేలోకి అన్నాడీఎంకే మళ్లీ రావడంపై కొద్దివారాలుగా సాగుతున్న చర్చల ప్రక్రియకు అమిత్ షా ప్రకటనతో తెరపడింది. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా కూటమి పనిచేస్తుందని అమిత్‌షా చెప్పడంతో కీలక అంశాలపై విభేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టి ఉమ్మడి అజెండాతో పనిచేయనున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. అన్నామలైని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు ‘అదేమీ లేదు. ఈ రోజు కూడా ఆయనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. అందుకే ఆయన వేదికపై నా పక్కన కూర్చున్నారు. మీ ప్రశ్నలో ఎలాంటి వాస్తవం లేదు. సమగ్ర, బలమైన కూటమిని నిర్మించాలన్న ఉద్దేశం కారణంగానే జాప్యం జరిగింది’ అని ఆయన బదులిచ్చారు. కానీ.. ఆ త‌ర్వాత ఆయ‌నే ఒక ట్వీట్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌దవికి ఒకే నామినేష‌న్ వ‌చ్చింద‌ని, దానితో కొత్త అధ్య‌క్షుడిగా నైనార్ నాగేంద్ర‌న్ ఎంపిక‌య్యార‌ని అమిత్‌షా పేర్కొన‌డం విశేషం.

గ‌తంలో బీజేపీ, అన్నాడీఎంకే మిత్ర‌ప‌క్షాలుగా ఉన్నాయి. 2023లో విడిపోయాయి. తాజాగా మ‌ళ్లీ కూట‌మి ప్ర‌తిపాద‌న‌లు రావ‌డంతో నాయ‌క‌త్వం ఎవ‌రి చేతిలో ఉండాల‌న్న‌దానిపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ‌లు కొన‌సాగిన‌ట్టు తెలుస్తున్న‌ది. గ‌తంలో కూట‌మి విచ్ఛిన్నం కావ‌డానికి అన్నామ‌లై దురుసు వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మ‌నే భావ‌న‌లో అన్నాడీఎంకే నేత‌లు ఉన్నారు. ఎట్ట‌కేల‌కు త‌మ పంతం నెగ్గించుకున్నారు. నిజానికి అన్నామ‌లై, ప‌ళ‌నిస్వామి ఇద్ద‌రూ త‌మిళ‌నాడులో కీల‌క సామాజిక‌వ‌ర్గ‌మైన గౌండ‌ర్ కులానికి చెందిన‌వారే. బీజేపీ సైతం ద‌క్షిణాదిలో మ‌రో కీల‌క రాష్ట్రంలో పాగా వేసే ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఈ స‌ర్దుబాటుకు దిగిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది.