112 మంది ‘దేవుళ్ల’కు అఖిల భారతీయ అఖాడా పరిషద్ షోకాజ్ నోటీసులు!
తమకు తాము దేవుళ్లుగా ప్రమోట్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్న బాబాలపై హిందూ ఆధ్యాత్మిక నేతల సంస్థ అయిన అఖిల భారత అఖాడా పరిషద్ కొరడా ఝళిపించింది

ఉజ్జయిని: తమకు తాము దేవుళ్లుగా ప్రమోట్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్న బాబాలపై హిందూ ఆధ్యాత్మిక నేతల సంస్థ అయిన అఖిల భారత అఖాడా పరిషద్ కొరడా ఝళిపించింది. ఇటీవల హత్రాస్‌లో తనను తాను దేవుడిగా పిలిపించుకునే.. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున తొక్కిసలాటు చోటు చేసుకుని 120 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈయన ఒక్కరే కాదు.. దేశంలో అనేక మంది తమను తాము దేవుళ్లుగా కీర్తించుకుంటూ ప్రజలకు టోకరా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 112 మందికి ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అఖిల భారత అఖాడా పరిషద్ అధిపతి రవీంద్ర పూరి మహారాజ్ బుధవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిని సందర్శించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో 2028లో నిర్వహించనున్న మహాకుంభ్‌కు సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాధువులు తమను తాము దేవుళ్లుగా చెప్పుకొంటున్న ఇబ్బందిక ధోరణి ఇటీవల పెరుగుతున్నదని విచారం వ్యక్తం చేశారు. కొంతమంది ఆధ్యాత్మిక గురువులు వారు దేవుడి భక్తులన్న విషయాన్ని గుర్తించడానికి బదులు తమకు తామే రాముడినని, విష్ణువునని, బ్రహ్మనని చెప్పుకొంటున్నారని విమర్శించారు. ఇటువంటి చర్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. అటువంటి ‘దేవుళ్ల’పై కొరడా ఝళిపించాలని అఖాడా పరిషద్ నిర్ణయించిందని రవీంద్ర పూరి మహారాజ్ తెలిపారు. అటువంటివారికి ప్రయాగ్‌రాజ్‌లో 2028లో నిర్వహించే మహాకుంభ్‌లో ప్రవేశాన్ని నిషేధిస్తామని చెప్పారు.
కొందరు హిందూ ఆధ్యాత్మికవేత్తలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేయడంపైనా రవీంద్ర పూరి మహారాజ్ విచారం వ్యక్తం చేశారు. అటువంటివారిని గుర్తించి, వారు ఏ అఖాడా పరిధిలోకి వస్తారో చూసి ఆయా అఖాడాల నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 112 మంది బాబాలకు 13 అఖాడాలు షోకాజ్ నోటీసులు జారీ చేశాయని ఆయన తెలిపారు. నోటీసులు జారీ అయినవారిలో జునా, శ్రీ నిరంజని, నిర్మోహి అఖాడాలక చెందిన వారు కూడా ఉన్నారు. తమ నోటీసులకు సెప్టెంబర్ 30లోపు సమాధానాలు ఇవ్వకపోతే వారిని ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ 2028కు హాజరుకాకుండా నిషేధిస్తామని మహారాజ్ తెలిపారు. తమను తాము దేవుళ్లుగా చాటుకునేవారు సనాతన ధర్మానికి హాని చేస్తున్నారని మహారాజ్ విమర్శించారు. హిందూ మత ప్రతిష్ఠను దెబ్బతీయకుండా వారిని నిరోధించాల్సి ఉన్నదని అన్నారు.
హిందూ మతంలోని నిర్దిష్ట సమూహాలను అఖాడాలుగా పేర్కొంటారు. ప్రధానంగా శైవులు, వైష్ణవులు, మితవాదులు అనే మూడు ప్రధాన విభాగాలుగా ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా హిందూ మత బోధనలు చేసేందుకు ఆది శంకరాచార్య ఈ అఖాడాలను ఏర్పాటు చేశారని నమ్ముతారు.