Anil Ambani | అనిల్‌ అంబానీకి ఈడీ మరో షాక్..!

ఈడీ మరోసారి అనిల్ అంబానీపై తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. రూ.17,000 కోట్లకు పైగా బ్యాంకుల రుణాలు అక్రమంగా పొందినట్టు ఆరోపణలు వస్తుండగా.. ఇప్పటికే పలు బ్యాంకులకు నోటీసులు, అనిల్‌కు సమన్లు జారీ చేసింది. పీఎంఎల్‌ఏ కింద విచారణ ముమ్మరమవుతోంది.

Anil Ambani | అనిల్‌ అంబానీకి ఈడీ మరో షాక్..!

Anil Ambani | న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. బ్యాంకులను మోసగించి తప్పుడు మార్గాల్లో రుణాలు పొందిన కేసులలో ఇటీవల అనిల్ అంబానీ కంపనీల్లో విస్తృత సోదాలు నిర్వహించిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఆయన సంస్థలకు అప్పులిచ్చిన పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం 12 నుంచి 13 బ్యాంకులకు నోటీసులు పంపినట్లు సమాచారం. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు బ్యాంకులు కూడా ఉన్నాయి. రిలయన్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లాంటి కంపెనీలకు బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సింద్‌ బ్యాంక్‌ ఉన్నట్లుగా సమాచారం. అనిల్‌ అంబానీ సంస్థలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు అధికారులకు ఈడీ నుంచి నోటీసులు వెళ్లాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సహా అనిల్‌ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను పొంది..ఆ నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.

గత వారం రూ.3,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్‌ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న బిస్వాల్‌ ట్రేడ్‌ లింక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎండీ.పార్థసారధిని ఈడీ అరెస్టు చేసింది. ఆయనపై పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. రిలయన్స్‌ పవర్‌ కోసం దాదాపు రూ.68.2 కోట్లకు తప్పుడు హామీ పత్రాలను అతడు సమర్పించినట్లు అభియోగాలు మోపింది. అలాగే 2017-19 మధ్య యస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలకు లభించిన రూ.3,000 కోట్ల రుణంపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఈనెల 5న తమ ఎదుట హాజరుకావాల్సిందిగా అనిల్‌కు ఈడీ సమన్లు పంపించింది. ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్‌ సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అనిల్ అంబానీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేయనుంది. రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలకు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లను కూడా విచారించేందుకు ఈడీ సిద్ధమవుతుంది.