తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు అన్నామలై ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తాను తమిళ అస్థిత్వాన్ని వదులుకోలేనని, రాష్ట్ర అభివృద్ధే నా ప్రథమ ప్రాధాన్యం అని తెలిపారు. తమిళ రాజకీయాల్లో సరికొత్త ఉద్యమం మొదలైందని, ప్రజల తరుపున నిజమైన మార్పు కోసం పోరాటం చేస్తానన్నారు. నా కొత్త రాజకీయ పార్టీలో కొత్తవారిని ప్రోత్సహిస్తానని అన్నామలై తెలిపారు. గత 18 నెలలుగా బీజేపీతో విభేదాలు కొనసాగాయి అని, వాస్తవానికి గత డిసెంబర్ లోనే బీజేపీని వీడాలని అనుకున్నానని వెల్లడించారు. బీజేపీతో ఆరేళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నానని అన్నామలై తెలిపారు.

ఐపీఎస్ నుంచి బీజేపీలోకి..

జాతీయవాద భావజాలానికి ఆకర్షితుడైన అన్నామలై బీజేపీ సిద్దాంతాలు నచ్చి తను చేస్తున్న ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2019లో బీజేపీలో చేరారు. 2021లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర సారధిగా పనిచేశారు. దూకుడైన..ముక్కుసూటీ రాజకీయాలు చేసే అన్నామలై రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ప్రజాఉద్యమాలు నిర్వహించారు. దీంతో ద్రవిడ గడ్డప తమిళనాడులో క్షేత్ర స్థాయిలో బీజేపీ బలం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఆయన చేపట్టిన ఎన్ మన్, ఎన్ మక్కల్ (నా భూమి, నా ప్రజలు) పాదయాత్ర తమిళనాడులో బీజేపీ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

అయితే ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తును అన్నామలై వ్యతిరేకించారు. అంతేకాకుండా పళనస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకు టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి బీజేపీ జాతీయ నాయకత్వంతో అన్నామలైకు విబేధాలు తీవ్రతరమయ్యాయి. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మూడో స్థానానికే పరిమితమైంది. తమిళనాడు బీజేపీలోని పాత తరం సీనియర్ నేతలకు, అన్నామలై పనితీరుకు అస్సలు పడటం లేదనే టాక్ చాలా కాలంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

కొత్త పార్టీ ఆలోచనతో ఉన్న అన్నామలై బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమిత్ షాతో కీలక భేటీ అనంతరం ఆయన రాజీనామా నిర్ణయానికి అధిష్టానం కూడా వెంటనే ఆమోద ముద్ర వేసింది. అన్నామలై త్వరలో తమిళల మక్కల్ కళగం, లేదా తమిళగ మక్కల్ కట్చి పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. అన్నామలై కొత్త పార్టీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు ఉన్నట్లుగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో పోస్టర్లు, ప్లెక్సీలు వెలియడం ఆసక్తికరం. గతంలో డీఎంకే అవినీతిని ఎండగట్టిన అన్నామలై.. ప్రస్తుత విజయ్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నారు. బీజేపీలో ఉంటే అవన్నీ సాధ్యం కాదనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏదిఏమైనా అన్నామలై బీజేపీని వీడడం తమిళనాట ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు.