ఆర్మీలో ‘ఎన్‌వోకే’ నిబంధనలు మార్చాలంటున్న .. అన్షుమన్‌ తల్లిదండ్రులు

దురదృష్టవశాత్తూ సైనికుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు అందించే ఆర్థిక సహాయం (ఎన్‌వోకే) విషయంలో మార్పులు చేయాలని అమరజవాన్‌ కెప్టెన్‌ అన్షుమన్‌సింగ్‌ తల్లిదండ్రులు ఇండియన్‌ ఆర్మీకి విజ్ఞప్తి చేశారు.

ఆర్మీలో ‘ఎన్‌వోకే’ నిబంధనలు మార్చాలంటున్న .. అన్షుమన్‌ తల్లిదండ్రులు

– మా కోడలు కనీసం కీర్తిచక్రి అవార్డును కూడా తాకనివ్వలేదు
– ఫొటో తప్ప మాకు మరేమీ మిగల్లేదు
– అమర జవాన్‌ అన్షుమన్‌సింగ్‌ తల్లిదండ్రులు

న్యూఢిల్లీ: దురదృష్టవశాత్తూ సైనికుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు అందించే ఆర్థిక సహాయం (ఎన్‌వోకే) విషయంలో మార్పులు చేయాలని అమరజవాన్‌ కెప్టెన్‌ అన్షుమన్‌సింగ్‌ తల్లిదండ్రులు ఇండియన్‌ ఆర్మీకి విజ్ఞప్తి చేశారు. ఇటీవల అన్షుమన్‌ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలైలో సియాచిన్‌లో ఒక అగ్నిప్రమాదం నుంచి తన సహచరులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒక వార్తాచానల్‌తో అన్షుమన్‌సింగ్‌ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్‌, మంజు సింగ్‌ మాట్లాడుతూ.. తమ కోడలు తమతో కలిసి ఉండటం లేదని, తమ కుమారుడి మరణానంతరం అందిన ఆర్థిక సహాయంలో ఎక్కువ భాగాన్ని తీసుకుని వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌వోకే విషయంలో అనుసరిస్తున్న ప్రామాణికం సరైంది కాదు. దీని గురించి నేను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కూడా మాట్లాడాను. అన్షుమన్‌ భార్య ఇప్పుడు మాతో కలిసి ఉండటం లేదు. అతడు చనిపోయే సమయానికి పెళ్లయి ఐదు నెలలే అవుతున్నది. పిల్లలు లేరు. మాకు ఇప్పుడు గోడపై దండతో వేలాడుతున్న మా కొడుకు ఫొటో ఒక్కటే మిగిలింది’ అని రవిప్రతాప్‌సింగ్‌ చెప్పారు. ‘అందుకే ఎన్‌వోకే నిర్వచనాన్ని స్థిరీకరించాలని మేం కోరుకుంటున్నాం. అమర వీరుడి కుటుంబంతోనే భార్య ఉంటే.. ఎవరి బాధ్యత ఎంత అనేది నిర్ణయించాలి’ అని అన్నారు. ఇతర తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకుండా ఎన్‌వోకే రూల్స్‌ మార్చాలని అన్షుమన్‌ తల్లి మంజు సింగ్‌ చెప్పారు.

మరొక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిప్రతాప్‌సింగ్‌ మాట్లాడుతూ.. అన్షుమన్‌ దుస్తులు, ఫొటో ఆల్బం, ఇతర జ్ఞాపకాలతోపాటు కీర్తి చక్ర అవార్డును కూడా తమ కోడలు స్మృతి గుర్దాస్‌పూర్‌లోని తన నివాసానికి తీసుకుని వెళ్లిపోయిందని చెప్పారు. తమ కోడలు తమ కుమారుడికి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లలో శాశ్వత చిరునామాను కూడా లక్నో నుంచి గుర్దాస్‌పూర్‌కు మార్చుకున్నదని తెలిపారు. దీంతో అన్ని రకాలా సంప్రదింపులు ఆ చిరునామాతోనే కొనసాగుతున్నాయని చెప్పారు. ఆఖరుకు తమ కుమారుడికి వచ్చిన కీర్తిచక్ర పురస్కారాన్ని తాము పట్టుకున్నదే లేదని తెలిపారు.
కీర్తిచక్ర పురస్కారం.. భారతదేశపు శాంతికాలపు గ్యాలెంటరీ అవార్డుల్లో రెండవ అత్యున్నతమైనది. ‘జూలై 5వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డును స్వీకరించే సమయంలో ఆర్మీ అధికారుల సూచనతో ఆ పురస్కారాన్ని ఫోటో దిగడానికి ఒక్కసారి పట్టుకున్నాను. ఆ తర్మాత స్మృతి దానిని నా చేతుల్లోంచి తీసుకున్నది’ అని మంజు సింగ్‌ చెప్పారు.

ఎన్‌వోకే నిబంధనలు ఏంటి?

సర్వీసులో ఉన్న జవాన్‌కు ఏదైనా జరిగినప్పుడు ఆర్మీ నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని అమర జవాన్‌ తదుపరి కుటుంబీకులకు ఇస్తారు. ఒక వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు అతడి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను ఎన్వోకేగా పరిగణిస్తారు. జవాన్‌ లేదా ఆఫీసర్‌కు పెళ్లి అయిన పక్షంలో తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని ఎన్‌వోకేగా మార్చుతారు.