Junior doctor murdered । సంచలనం రేపిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ రేప్‌, హత్య: నిందితుడి అరెస్ట్‌.. ఘటనపై సిట్‌ ఏర్పాటు

కోల్‌కతాలో ఒక జూనియర్‌ డాక్టర్‌ లైంగికదాడి, హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు.

 Junior doctor murdered । సంచలనం రేపిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ రేప్‌, హత్య: నిందితుడి అరెస్ట్‌.. ఘటనపై సిట్‌ ఏర్పాటు

 

junior doctor murdered । కోల్‌కతాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ (R G Kar Medical College)లో జూనియర్‌ డాక్టర్‌పై లైంగికదాడి, హత్య పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనను కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ శనివారం ధృవీకరించారు. ‘ఇదొక దురదృష్టకర ఘటన. హాస్పిటల్‌లోని సెమినార్‌ హాల్‌లో ఒక యువతి మృతదేహం పడి ఉందని స్థానిక తల పోలీస్‌ స్టేషన్‌కు శుక్రవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో సమాచారం వచ్చింది’ అని సీపీ వినీత్‌కుమార్‌ గోయల్‌ (CP Vineet Kumar Goyal) తెలిపారు. ఈ ఘటన మాకు తీవ్ర విషాదాన్ని, ఆవేదనను, ఆగ్రహాన్ని కలిగించింది. మేం మృతురాలి కుటుంబ సభ్యుల పక్షాన, డాక్టర్ల పక్షాన ఉన్నాం. మా నుంచి ఏం చేయాలో అంతా చేస్తాం. పారదర్శకంగా దర్యాప్తు (investigation) చేస్తున్నాం. ఈ ఘటనపై వేరొక సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని కుటుంబ సభ్యులు కోరితే అందుకూ సిద్ధంగా ఉన్నాం’ అని గోయల్‌ తెలిపారు. ‘సీసీటీవీ ఫుటేజ్‌ (CCTV evidence), డాక్టర్లు, ఇతర సాక్షులను విచారించడంతోపాటు ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. నిందితుడిపై బలమైన ఆధారాలు లభించాయి’ అని ఆయన చెప్పారు.

ఈ ఘటనలో సంబంధం ఉందని అనుమానిస్తున్న సంజయ్‌ రాయ్‌ (Sanjoy Roy) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. నేరం జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీల ఫుటేజ్‌ను సేకరించామని చెప్పారు. ‘లభించిన ఆధారాలతో ఒక వ్యక్తిని అరెస్టు చేశాం. దర్యాప్తు కొనసాగుతున్నది’ అని ఆయన తెలిపారు. ఘటనపై సమాచారం అందిన తర్వాత జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ (judicial magistrate), మృతురాలి తల్లిదండ్రులను, మెడికల్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల సమక్షంలో పంచనామా (inquest) నిర్వహించినట్టు వివరించారు. అనంతరం పోస్టుమార్టం (post-mortem) నిర్వహించామని చెప్పారు. ఇద్దరు మహిళా డాక్టర్లు కూడా ఉన్న ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేసిందని, ఆ ప్రక్రియ మొత్తాన్నీ వీడియోలో చిత్రీకరించామని గోయల్‌ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, విద్యార్థుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించామని చెప్పారు. నిందితుడికి క్యాంపస్‌తో సంబంధం లేదని, బయటి వ్యక్తి అని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. అయితే.. అతడికి కాలేజీలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో ఎప్పుడంటే అప్పుడు వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు. అతడి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటతో అరెస్టు చేశామని తెలిపారు.

నిందితుడి నేపథ్యం గురించి ప్రశ్నించగా.. ‘మా దృష్టిలో అతడు పెద్ద నేరస్తుడు. అతడు చేసిన తీవ్ర నేరానికి అంతే తీవ్రమైన శిక్ష పడేలా మేం ప్రయత్నిస్తాం’ అని సీపీ బదులిచ్చారు. ప్రస్తుతం నిందితుడిని ఇంటరాగేట్‌ చేస్తున్నామని, ఆ సమయంలో అతడు అక్కడ ఎందుకు ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు అక్కడ ఉన్నాడని తాము ధృవీకరించుకున్నామని తెలిపారు. లైంగికదాడి జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయని అదనపు పోలీస్‌ కమిషనర్‌ మురళిధర్‌ చెప్పారు. ‘ఇది చాలా సున్నితమైన కేసు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల (Supreme Court guidelines) మేరకు అన్ని వివరాలూ వెల్లడించలేం. ఇది హత్య, లైంగికదాడి కేసు’ అని ఆయన తెలిపారు.