అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంలో విమర్శలు వెల్లువెత్తడంతో నైతిక బాధ్యతగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి ఇటీవల చంపత్‌రాయ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను ట్రస్ట్ సోమవారం ఆమోదించింది. మరోవైపు చంపత్‌రాయ్ స్థానంలో ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రాను నియమిస్తున్నట్లు సమాచారం. అలాగే రామమందిర నిర్వహణకు సంబంధించి భవిష్యత్తులో తీసుకునే చర్యలు, నూతన పరిపాలన వ్యవస్థ ఏర్పాటు వంటి వాటి గురించి ఈ సమావేశంలో చర్చించినున్నారు. అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో చంపత్ రాయ్ డ్రైవర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితులు ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమితులైన వారే కాగా..వారంతా కొంతకాలంగా విరాళాలను కాజేస్తూ వచ్చారని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
విరాళాల సొమ్ముతో లక్షల్లో ఆస్తిపాస్తులు
అవినాశ్ శుక్లా అనే ఉపాధ్యాయుడి ఇంటి నుంచి దాదాపు రూ.20 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, నగలు స్వాధీనం చేసుకున్నారు. అతడు తన స్నేహితురాలికి రూ.2 లక్షల నగదు, ఖరీదైన మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చిన విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుకల్ప్ మిశ్ర అనే మరో నిందితుడి వద్ద రూ.65 లక్షల విలువ చేసే ఇల్లు, స్వగ్రామంలో ఫాంహౌస్, ఖరీదైన బైక్ , కొత్తగా బుక్ చేసి ఓ ఎస్‌యూవీ కారును పోలీసులు గుర్తించారు. అతడి ఇంట్లో రూ.16.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రకు అతడు బంధువు. మరో సహ నిందితుడు, అనుకల్ప్ బావమరిది లవకుశ్ మిశ్ర ఔట్‌సోర్సింగ్‌లో నియమితుడయ్యాడు. అతడు గతంలో కారు మెకానిక్‌గా చేస్తూ నెలకు రూ.10-12వేలు సంపాదించేవాడు. సోదాల్లో అతడి ఇంట్లో రూ.14.25 లక్షల నగదు దొరుకడం గమనార్హం.
రాంశంకర్ మిశ్ర అనే మరో కాంట్రాక్టు ఉద్యోగి ఇంట్లో రూ.7.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగి సుభాష్ చంద్ర శ్రీవాస్తవను భక్తుల సేవా కేంద్రంలో విరాళాల లెక్కింపు సూపర్‌వైజర్‌గా ట్రస్టు నియమించింది. అతడు ఈ కుంభకోణాన్ని కనిపెట్టడంలో విఫలమయ్యాడని పోలీసులు చెబుతున్నారు. హుండీలను తెరిచి, నగదు వేరుచేసి లెక్కించే పనిలో ఉన్న కరుణేశ్ పాండే అనే ఒప్పంద ఉద్యోగి ఇంట్లో రూ.18 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
