బారాబంకిలో ఘోర హత్య: ఐస్‌క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి

బారాబంకి జిల్లా, పర్సావల్ గ్రామంలో ఐస్‌క్రీమ్ విక్రేతను తల నరికి హత్య చేసిన వ్యక్తి, ఆ తలను ఇంటికి తీసుకెళ్లి.. వంట చేస్తూ కనిపించడం కలకలం రేపింది. ఒక్కోసారి చిన్న గొడవ ఎంత భయానకంగా మారుతుందో ఈ ఘటన స్పష్టం చేసింది.

బారాబంకిలో ఘోర హత్య: ఐస్‌క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి హత్యకు గురైన ఐస్‌క్రీమ్ విక్రేత బబ్లూ (ఫైల్ ఫోటో)

UP Shocker: Man Beheads Ice Cream Vendor, Carries Severed Head Home

బారాబంకీ (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్ బారాబంకీ జిల్లా, పర్సావల్ గ్రామంలో శనివారం భయానక ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల ఐస్‌క్రీమ్ విక్రేత బ్లూను 50 ఏళ్ల స్థానికుడు శంకర్ యాదవ్ పట్టపగలు రోడ్డు మీదే తల నరికి హత్య చేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం, బబ్లు ప్రతిరోజూ మాదిరిగానే 20 కిమీల దూరంలోని తన ఊరినుండి  పర్సావల్ వచ్చి ఐస్‌క్రీమ్ అమ్ముతుండగా, శంకర్ యాదవ్‌తో వాగ్వాదం జరిగింది. ఇక్కడ ఐస్​క్రీమ్​ అమ్మొందంటూ శంకర్ అభ్యంతరం వ్యక్తం చేయగా, బబ్లూ నిరాకరించాడు. క్రమంగా మాటామాటా పెరిగి ఆవేశాలకు దారితీసింది.

ఆగ్రహంతో ఉన్న శంకర్ యాదవ్ ఇంటికి వెళ్లి, పదునైన ఆయుధంతో వచ్చి బబ్లూపై దాడి చేసి, తల నరికాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

తలను ఇంటికి తీసుకెళ్లికాల్చడానికి ప్రయత్నం

హత్య అనంతరం నిందితుడు చేసిన చర్యలు మరింత కలకలం రేపాయి. బబ్లూ తలను చేత్తో పట్టుకొని ఇంటికి తీసుకెళ్లిన శంకర్ యాదవ్ పొయ్యి పక్కనే పెట్టి, నింపాదిగా వంట చేయడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా సూపరింటెండెంట్ అర్పిత్ విజయ్‌వర్గీయ నేతృత్వంలో ఘటనాస్థలానికి చేరుకుని ఇంటిని చుట్టుముట్టారు. లోపలికి ప్రవేశించినప్పుడు నిందితుడు వంట చేస్తూ ఉండగా, పక్కనే బబ్లూ తల కనిపించింది. దాన్ని కాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, తలను స్వాధీనం చేసుకున్నారు. బబ్లూ శరీరాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.

బబ్లూ ముగ్గురు సోదరుల్లో పెద్దవాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతని మరణంతో భార్య, ఇద్దరు చిన్న పిల్లలు దిక్కులేనివారయ్యారు. వారి రోదన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది.

ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్న గొడవే వివాదానికి దారితీసి దారుణ హత్యకు దారితీసిందని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.