Bihar tragedy | హాజీపూర్‌లో విషాదం.. గుడికి వెళ్తున్న భక్తులకు విద్యుత్ షాక్.. 8 మంది దుర్మరణం..!
Bihar tragedy | దైవదర్శనం కోసం బయలుదేరిన భక్తులు అనంతలోకాలకు చేరుకున్నారు. మాయదారి కరెంటు మార్గమధ్యలో వారి ప్రాణం తీసంది. బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం ఆనందంగా కలిసి వెళ్తున్న భక్తులను కరెంటు కాటేసింది.

Bihar tragedy : దైవదర్శనం కోసం బయలుదేరిన భక్తులు అనంతలోకాలకు చేరుకున్నారు. మాయదారి కరెంటు మార్గమధ్యలో వారి ప్రాణం తీసంది. బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం ఆనందంగా కలిసి వెళ్తున్న భక్తులను కరెంటు కాటేసింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు విద్యుత్ షాక్‌తో ఆస్పత్రి పాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. హాజీపూర్ జిల్లాకు చెందిన కొందరు భక్తులు మినీ ట్రక్కులో సుల్తాన్‌పూర్‌లోని హరిహరనాథ్ ఆలయంలో దైవ దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో తాము ప్రయాణిస్తున్న వాహనానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దాంతో వాహనంలో ఉన్న భక్తులందరికీ షాక్ తగిలింది. వారిలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళనకు దిగారు.