ఉప ఎన్నికల్లో బీజేపీకి జెన్ జీ షాక్ !

బీహార్ బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ వెనుకబడింది. ఈ ఫలితాలను నీట్ ఉద్యమం, జెన్ జీ ఓటింగ్ ధోరణితో ముడిపెడుతూ చర్చ సాగుతోంది.

బీహార్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌లలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరింది. బీహార్‌లోని బంకిపూర్, గుజరాత్‌లోని మంజల్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బంకీపూర్ సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. మంజల్ పూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హత కారణంగా ఉప ఎన్నిక నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీపై జెన్ జీ నిరసనల మధ్య జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా అందరి దృష్టికి ఆకర్షిస్తున్నాయి.

బీజేపీకీ జెన్ జీ తొలి దెబ్బ

రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో జరిగిన బంకీపూర్‌ స్థానం ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి అంచున కొనసాగుతుంది. 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక పోటీ విజేతను నిర్ణయించడానికి మొత్తం 31 రౌండ్లు కౌంటింగ్‌ జరుగనున్నది. జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ 14 రౌండ్ల లెక్కింపు తర్వాత 8,000కుపైగా ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా రెండో స్థానంలో, ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక గత రెండు ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆర్జేడీకి ఈసారి జనాదరణ మరింతగా తగ్గింది. బీజేపీ కంచుకోటగా బంకీపూర్ నియోజకవర్గానికి పేరుంది. 1995 నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అసాధారణ ఆధిక్యంతో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలో నెగ్గితే జన్ సురాజ్ పార్టీకి ఇది తొలి విజయంగా నిలిచిపోతుంది.

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో యువత ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోతే..అది జెన్ జీ దెబ్బ ఫలితమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్జేడీకి చెందిన రేఖా గుప్తాపై బీజేపీ అభ్యర్థి నితీన్ నబీన్ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించి వరుసగా ఐదోసారి ఈ సీటును నిలబెట్టుకున్నారు. ఈసారి కూడా ఆర్జేడీ అభ్యర్థిగా రేఖాగుప్తానే బరిలో నిలిచినా, నబీన్ స్ధానంలో నీరజ్ సిన్హాను బరిలోకి దింపి ఓటమి దిశగా సాగుతుంది. ఇటీవల విద్యార్ధుల నిరసన సందర్బంగా జెన్ జీ ని వైరస్‌గా నితిన్ నబిన్ అభివర్ణించడం తెలిసిందే.

దతియా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 12,221 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండటంతో, కాంగ్రెస్ కార్యకర్తలు ‘మెలోడీ’ టఫీలను పంచుతూ హంగామా చేశారు.

Latest News