విధాత : సమాజంలో చోటుచేసుకునే అరుదైన ఘటనలు అందరిని అశ్చర్యపరుస్తుంటాయి. పాముకాటుతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని గంగానదిలో వదిలేసిన తల్లిదండ్రుల చెంతకు 8ఏళ్ల తర్వాతా కొడుకు తిరిగొచ్చిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లా మానోపుర్ ముషహరి గ్రామానికి చెందిన కవిత, రామ్‌ప్రీత్ దాస్ దంపతులకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.
12 ఏళ్ల వయసులో రాహుల్ కాలకృత్యాలు తీర్చుకుందామని నది వద్దకు వెళ్లిన సమయంలో పాముకాటుకు గురయ్యాడు. వెంటనే చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో కుమారుడు చనిపోయాడని రోధించిన తల్లిదండ్రులు చేసేదిలేక తమ సాంప్రదాయం మేరకు మృతదేహాన్ని అయోధ్య ఘాట్ వద్ద గంగానదిలో వదిలేశారు.
ఇది జరిగిన సరిగ్గా 8 ఏళ్ల తర్వాత రాహుల్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను పేరు పేరునా ఆప్యాయంగా పలకరించాడు. చనిపోయిన కుమారుడు తిరిగి రావడం ఏమిటనుకుంటూ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి తొలుత ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. అయితే రాహుల్ శరీరంపై ఉన్న గాయాన్ని చూసి తల్లిదండ్రులు అతడు తమ కుమారుడేనని గుర్తించారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కొడుకు మాటల్లో తెలుసుకుని మరింత అశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు.
చనిపోయాడనుకుని ఆ రోజు గంగానదిలో వదిలేసిన నన్ను.. నది ప్రవాహంలో కొట్టుకపోతుండగా, చూసిన ఓ సాధువు కాపాడారని, ఆధ్యాత్మిక విద్య సాధనకు గోరఖ్‌పుర్ తీసుకువెళ్లాడని రాహుల్ వెల్లడించాడు. తమ కొడుకు విషయంతో జరిగిన అద్భుతాన్ని చూసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు అదంతా దైవలీల అనుకుంటూ..ప్రాణాలతో తిరిగొచ్చిన తమవాడిని చూసుకుని మురిసిపోయారు.
