నాలుగు రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర శాఖలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ గురువారం బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదేశాలు జారీ చేశారు. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనాగుప్తాను నియమించింది. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా, పంజాబ్ అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ థిల్లాన్, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేవ్ రాయ్ లు నియామితులయ్యారు.
ఇటీవలే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విక్టరీ సాధించిన బీజేపీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకుంటూ నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. ఇంతకుముందు ఢిల్లీకి అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్‌దేవా, పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ ఝకార్, హర్యానా అధ్యక్షుడిగా మోహన్ లాల్ బదోలి, త్రిపుర అధ్యక్షుడిగా రజీబ్ భట్టాఛార్జీ ఉండేవారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేవల్ సింగ్ ధిల్లాన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉండేవారు. తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడు.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన హర్ష్ మల్హోత్రా తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన పార్టీ కోసం కొన్నాళ్లుగా కీలకంగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. హర్యానా అధ్యక్షురాలిగా ఎన్నికైన అర్చనా గుప్తా రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. ఆమెకు ఈసారి అధ్యక్షురాలిగా ప్రమోషన్ లభించింది. త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా నియామితులైన అభిషేక్ దేవ్‌రాయ్ త్రిపురలో అత్యంత కీలక నియోజకవర్గమైన మతార్బారి నుంచి పోటీ చేసి గెలిచారు.