అసెంబ్లీకి ఎంపీలను నిలుపడం వెనుక?

అసెంబ్లీకి ఎంపీలను నిలుపడం వెనుక?
  • ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన నేతలు లేరా?
  • ఇప్పటికే కర్ణాటకలో కాషాయ పార్టీకి చావుదెబ్బ
  • తాజాగా లద్దాక్‌ హిల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఓటమి
  • 5 రాష్ట్రాల్లో ఓడితే.. లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం
  • దానిని అడ్డుకోవడమే మోదీ-షా వ్యూహమా?

విధాత: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 ఎంపీలను బరిలో దింపింది. దీనిపై కొంతకాలంగా రాజకీయంగా చర్చ జరుగుతున్నది. మోడీ- షా ద్వయం వ్యూహం ఏమై ఉంటుందనేది ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి తెలంగాణ వంటి రాష్ట్రంలో అభ్యర్థులుగా బలమైన నాయకుల కొరత ఉన్నదంటే అర్థం ఉన్నది. కానీ మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్నది. రాజస్థాన్‌లోనూ గతంలో అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ సర్వేల సంగతెలా ఉన్నా.. కాంగ్రెస్‌ బలమైన పార్టీగా ఉన్నది. ఈసారి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని సర్వేల సారాంశం.

రాజస్థాన్‌లోనూ ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు ఉండనున్నది. మరి ఎన్నడూలేని విధంగా ఈసారి బీజేపీ ఎందుకు భయపడుతున్నది? ఎంపీలను ఎందుకు పోటీ చేయిస్తున్నది? దీనికి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఒక్కటే. ఆ మూడు రాష్ట్రాల్లో 65 లోక్‌సభ స్థానాలున్నాయి. కర్ణాటకతో కలుపుకొంటే 93 స్థానాలున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో 2018లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కర్ణాటకలోనూ మెజారిటీ మార్క్‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది. అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో 80 పైగా సీట్లు దక్కించుకున్నది.

కర్ణాటకతో మొదలై లద్దాక్‌ దాకా

ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ పెద్దలు భావించినా.. ఇంత ఘోరంగా ఓటమి చవిచూడాల్సి వస్తుందని ఊహించలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇండియా కూటమి బలపడుతున్నది. ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ కొన్నిచోట్ల తమ సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవడమే కష్టంగా మారింది. తాజాగా లద్దాఖ్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లోనూ బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది.

జమ్ముకశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు లద్దాఖ్‌ ఎంపీ నంగ్మాల్‌ విపక్షాలపై సెటైర్లు వేశారు. ఆ ఆర్టికల్‌ రద్దు వల్ల రెండు కుటుంబాలకే నష్టమంటూ.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘లద్దాక్‌ నుంచి వచ్చింది నేను.. మీరు కాదు. ఇది జస్ట్‌ ట్రైలర్‌ మాత్రమే’ అన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ నవ్వారు. నంగ్మాల్‌ ప్రసంగాన్ని మోదీ, షాలు ట్విటర్‌లో కూడా షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఆర్టికల్‌ రద్దు అయిన నాలుగేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) కూటమి విజయం సాధించింది.

మొత్తం 26 సీట్లలో ఎన్‌సీ 12 సీట్లు సాధించగా.. కాంగ్రెస్‌ 10 స్థానాలు కైవసం చేసుకున్నది. బీజేపీ రెండు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అప్పుడు నంగ్మాల్‌ అన్నట్లే కాషాయపార్టీకి కర్ణాటక ఫలితాలు ఒక ట్రైలర్‌ మాత్రమే పూర్తి సినిమా ఏమిటి అన్నది బీజేపీ అధిష్ఠానానికి అర్థమైంది. అందుకే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో ఎంపీలను బరిలోకి దింపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఈ రాష్ట్రాల్లో కషాయ పార్టీకి కష్టకాలమే

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని 90 పైగా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 80 పైగా గెలిచినా ఈసారి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే మహారాష్ట్ర, బీహార్‌లో బీజేపీ కూటమి నుంచి జేడీయూ, శివసేన దూరమయ్యాయి. మహారాష్ట్రలో 48 సీట్లకు గాను బీజేపీ 23 స్థానాల్లో గెలిచింది. శివసేనకు 18 సీట్లు దక్కాయి. ఎన్సీపీ నాలుగు సీట్లు గెలుచుకున్నది. శివసేన, ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి అన్నిసీట్లను దక్కించుకోవడం అంత ఈజీ కాదని అక్కడ రాజకీయ వాతావరణం చూస్తే తెలుస్తోంది. ఇక బీహార్‌లో అయితే 40 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి (బీజేపీ, జేడీయూ, లోక్‌జన్‌శక్తి పార్టీ) 39 చోట్ల నెగ్గింది.

అందులో బీజేపీ 17, జేడీయూ 16, లోక్‌జన్‌శక్తి 6 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ జేడీయూ.. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి. యూపీలోనూ 60కి పైగా సీట్లు గెలిచినా బీజేపీకి ఈసారి సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి సవాల్‌ ఎదురుకానున్నది. అక్కడ ఎస్పీ, కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డీ లాంటి పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి సగానిపైగా సీట్లలో గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల అన్నింటిలో కలిపి వచ్చిన సీట్లు 200పైగానే. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, ఒడిషా, తమిళనాడు, కేరళలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఇక్కడ ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఈసారి 15 పైగా సీట్లు దక్కితే అదే గొప్ప అన్నట్టు ఉన్నది.

ముందు నుయ్యి వెనుక గొయ్యి

పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నిసీట్లు సాధించినా అవి పార్టీని మూడోసారి అధికారంలో నిలబెట్టే పరిస్థితి లేదు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు బీజేపీ నేతలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిస్తే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి మరింత బలోపేతమౌతుంది. అప్పటివరకు తటస్థంగా ఉన్న మరిన్నిపార్టీలు కూడా ఆ కూటమికి దగ్గరయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు నిలువరించడానికే ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలు అసెంబ్లీకా?

పార్టీ అధికారంలో ఉండి, బలమైన నేతలు, క్యాడర్‌ ఉన్న రాష్ట్రాల్లోనే ఎంపీలను అసెంబ్లీ బరిలో దించితే.. తెలంగాణ సంగతేంటి? బీజేపీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావులు, రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్‌, విజయశాంతిలు ఎంపీలుగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా? అన్నది ఇంకా తేలలేదు. లేక అసెంబ్లీ ఎన్నికల్లో వీరిని దించి లోక్‌సభ ఎన్నికల నాటికి కొత్త అభ్యర్థులను తెరమీదికి తెస్తారా? అన్నది ఆ పార్టీ విడుదల చేసే తొలి జాబితా తర్వాత తేలుతుంది.