Vistara flight | విస్తారా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. ఈసారి చేతిరాతతో కూడిన లేఖలో!

పారిస్‌లోని చార్ల్స్‌ డిగాల్‌ ఎయిర్‌పోర్టు నుంచి వచ్చిన విస్తారా విమానంలో ఆదివారం (జూన్‌ 2, 2024) ఉదయం చేతిరాతతో కూడిన బాంబు బెదింపు లేఖ ముంబై ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేపింది

Vistara flight | విస్తారా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. ఈసారి చేతిరాతతో కూడిన లేఖలో!

ముంబై: పారిస్‌లోని చార్ల్స్‌ డిగాల్‌ ఎయిర్‌పోర్టు నుంచి వచ్చిన విస్తారా విమానంలో ఆదివారం (జూన్‌ 2, 2024) ఉదయం చేతిరాతతో కూడిన బాంబు బెదింపు లేఖ ముంబై ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేపింది. దీంతో విమానాశ్రయంలో పూర్తిస్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎయిర్‌సిక్‌నెస్‌ బ్యాగ్‌పై రాసి ఉన్న బెదింపు నోట్‌ను విమాన సిబ్బంది ఉదయం 10.08 గంటల ప్రాంతంలో గుర్తించారు. 294 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్న ఈ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 10.19 గంటలకు సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

పారిస్‌ నుంచి ముంబై వస్తున్న యూకే 024 బాంబు బెదిరింపు లేఖ అంశాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో ధృవీకరించారు. వెంటనే తాము సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ముంబై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అవగానే తాము భద్రతా సంస్థలకు తనిఖీలలో పూర్తిగా సహకరించామని చెప్పారు. వారణాసి నుంచి న్యూఢిల్లీ వెళుతున్న ఇండిగో ఫ్లైట్‌కు ఇటువంటి బెదిరింపు వచ్చిన మరుసటి రోజే తాజా బెదిరింపు రావడం గమనార్హం.

అయితే.. ఇండిగో ఫ్లైట్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌ నకిలీదని అధికారులు తేల్చారు. ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించేందుకు వచ్చిన తన భర్త హ్యాండ్‌ బ్యాగ్‌లో బాంబు పెట్టుకుని వచ్చాడని ఒక మహిళ ఫోన్‌ చేసి చెప్పినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని సదరు భర్త విమల్‌ కుమార్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు.