one nation, one election । జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఇప్పుడు బీజేపీకి సొంతగా బలం లేకపోయినా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంపై రాజకీయవర్గాల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అమల్లోకి తెస్తామని మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పడం గమనార్హం.

one nation, one election । అనేక సంవత్సరాలుగా చర్చల్లో నలుగుతున్న ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి కేంద్రం అడుగులు వేస్తున్నది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికకు బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని తెలిపారు. జమిలి ఎన్నికలు దేశంలో రెండు విడుతల్లో ఉంటాయని ఆయన చెప్పారు. తొలి విడుతలో లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. తొలి విడుత తర్వాత వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఒక అప్పాయింటెడ్ డేట్‌ను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక చర్యలు తీసుకోవాలని సూచించింది. సదరు తేదీ తర్వాత ఎన్నికలకు వెళ్లాల్సిన రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం లోక్‌సభతోపాటే ముగుస్తుంది. తద్వారా జమిలి ఎన్నికల నిర్వహణకు వీలవుతుంది. ఆ తర్వాతి దశలో వంద రోజులలోపు దేశంలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
అవిశ్వాస తీర్మానాలు నెగ్గినప్పుడు, హంగ్ ఏర్పడినప్పుడు లేదా ముందస్తుగా సభను రద్దు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధానానికి ఇబ్బంది కలుగకుండా పలు సిఫారసులు కోవింద్ కమిటీ చేసింది. అవిశ్వాసం నెగ్గినా, హంగ్ ఏర్పడినా సదరు అసెంబ్లీకి లేదా లోక్‌సభకు నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తర్వాత తాజాగా ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది.
బీజేపీకి లోక్‌సభలో సొంతంగా బలం లేక ఎన్డీయే పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఇప్పుడు బీజేపీకి సొంతగా బలం లేకపోయినా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంపై రాజకీయవర్గాల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అమల్లోకి తెస్తామని మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పడం గమనార్హం.