ఒడిశా తరహా బడ్జెట్ భేష్

ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న బడ్జెట్ స్థిరీకరణ నిధి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని కాగ్ అభినందించింది. ఇతర రాష్ట్రాలకు ఈ విధానం పాటించమని సూచన.

ఒడిశా తరహా బడ్జెట్ భేష్

హైదరాబాద్, విధాత : ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బడ్జెట్ స్థిరీకరణ నిధి బాగున్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభినందించింది. ఈ విధానాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని సూచించింది. దేశంలో పలు రాష్ట్రాలు సంక్షేమం పేరుతో వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే. నిధుల సరిపోక అప్పులు తీసుకునేందుకు తల తాకట్టు పెడుతున్నాయి. చాలా రాష్ట్రాల అప్పుల ఊబిలో ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు, బడ్జెట్ క్రమశిక్షణ పెంపొందించేందుకు కాగ్ పలు సూచనలు చేసింది.

కోవిడ్ తరువాత ఒడిశా ప్రభుత్వం బడ్జెట్ నిర్వహణ పై సమూల మార్పులు తీసుకువచ్చింది. ఆపత్కాలంలో నిధులకు లోటు లేకుండా ఉండేందుకు ఏ చర్యలు తీసుకోవాలో ఆర్థిక నిపుణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఒడిశా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు మైనింగ్ కార్యకలాపాలు. ప్రతి ఏడాది రూ.50వేల కోట్లకు పైగా ఈ రంగం నుంచే సమకూరుతున్నది. ప్రతి ఏడాది ఈ ఆదాయం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. మైనింగ్ ద్వారా పన్నుయేతర ఆదాయంలో 90 శాతానికి పైగా ఉండగా, రాష్ట్ర ఆదాయంలో 45 శాతం వరకు వాటా ఉంది. అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలతో సంబంధం లేకుండా బయట నిర్వహించాలని నిర్ణయం తీసుకుని 2023 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బీ.ఐ) ఆధ్వర్యంలో కార్పస్ ఫండ్ కు ప్రతి సంవత్సరం నిధులను బదిలీ చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.21వేల కోట్లు సమకూరాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వ సెక్యురిటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా వడ్డీ జమవుతున్నది. రాష్ట్రంలో అనుకోకుండా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఆర్థిక సంక్షోభం ఏర్పడినా ఆర్థిక సంస్థలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్ర‌కృతి వైపరిత్యాలను ఎదుర్కొనే రాష్ట్రంలో ఒడిశా కూడా ఉంది. రుణాలు తీసుకోవడం ద్వారా భారం పెరగడమే కాకుండా వడ్డీలు సంవత్సరాల తరబడి చెల్లించాల్సి ఉంటుంది. కార్పస్ ఫండ్ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు డ్రా చేసి వెచ్చించవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు, మిగులు నిధులు ఉన్న రాష్ట్రాలు ఈ విధానం పాటిస్తే ఉపయుక్తంగా ఉంటుందని కాగ్ పేర్కొంటున్నది.

ఒడిశా పాటిస్తున్న విధానం మూలంగా నీతి ఆయోగ్ ఆర్థిక సూచీలో వంద పాయింట్లకు గాను 99 పాయింట్లు సాధించింది. రుణ స్థిరత్వంలో అగ్రభాగాన ఉండగా, జీ.ఎస్.డీ.పీ నిష్ఫత్తి సగటు కన్నా ఎక్కువగా మూలధనం కలిగి ఉన్నది. ఈ విధానం మూలంగా ఆర్థిక లోటు 1.7 శాతం ఉండగా, జీ.ఎస్.డీ.పీ 16 వద్ద ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) లు ప్రతి సంవత్సరం కొంత మొత్తం నిధులను కార్పస్ ఫండ్ కు మళ్లించే వారు. ఈ నిధులను జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేసేవారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలియనిచ్చేవారు కాదు. ఉద్యోగుల జీతాలకు నిధుల లభ్యత లేని సమయంలో ఈ డిపాజిట్ల ను గ్యారెంటీ గా చూపి రుణం తీసుకునేవారు. జీహెచ్ఎంసీ, ఎంసీహెచ్ గా ఉన్న సమయంలోనే రూ.700 కోట్లు, హెచ్ఎండీఏలో రూ.400 కోట్ల డిపాజిట్లు ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ డిపాజిట్లు కరిగిపోగా, వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో హెచ్ఎండీఏ డిపాజిట్లు ఖాళీ అయ్యాయి. దాదాపు ఇదే తరహా విధానాన్ని ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్నది.