కర్ణాటకకు 3400 కోట్ల ఎన్డీఆర్ఎఫ్‌ సాయం…సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

కర్ణాటకకు 3400 కోట్ల ఎన్డీఆర్ఎఫ్‌ సాయం...సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

కర్ణాటకకు 3400 కోట్ల ఎన్డీఆర్ఎఫ్‌ సాయం…సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • తాము 18వేల కోట్లు అడిగామన్న కర్ణాటక
  • మే 6వ తేదీకి విచారణ వాయిదా

న్యూఢిల్లీ: కరువు పీడిత కర్ణాటకకు 3,400 కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరువు నిర్వహణ చర్యల కోసం రాష్ట్రానికి జాతీయ విపత్తుల నిధి నుంచి ఆర్థిక సహాయం అందించేలా కేంద్రాన్ని నిర్దేశించాలని కోరుతూ కర్ణాటకల ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా కొంత మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేశారా? అని ధర్మాసనం కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంటరమణిని ప్రశ్నించగా.. ఆయన.. దాదాపు 3,400 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. 3,400 కోట్లు విడుదల చేశారని, కానీ.. రాష్ట్రం 18వేల కోట్లు విడుదల చేయాలని కోరిందని తెలిపారు. మంత్రుల బృందం జరిపిన పరిశీలన జరిపి, మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక పంపిందని చెప్పారు. ప్రభుత్వ పిటిషన్‌తో జత చేసిన పత్రాలను ప్రస్తావిస్తూ.. కేంద్రం విధానానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి ఉన్నదని పేర్కొన్నారు. కరువుతో తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు జీవిక అందించేందుకు 12,577 కోట్లు అవసరమని తెలిపారు. కానీ.. ఎన్డీఆర్‌ఎఫ్‌ చట్టంలో భాగంగా ఉన్న ఈ అంశాన్ని కనీసం పట్టించుకోలేదని అన్నారు. తాము కేంద్రానికి పంపిన నివేదికను కోర్టు ముందు ఉంచాల్సింది కోరాలని, దాని ఆధారంగా ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. మంత్రుల బృందం సిఫారసులను మంత్రివర్గం ఉపసంఘం పరిగణనలోకి తీసుకున్నదని అటార్నీ జనరల్‌ వెంకటరమణి తెలిపారు. మంత్రుల బృందం సిఫారసుల గురించి వాకబు చేసిన ధర్మాసనం.. వాటిని తమ ముందు ఉంచాలని కోరింది. అందుకు అటార్నీ జనరల్‌ అంగీకరించారు. దీంతో ఈ అంశాన్ని మే 6వ తేదీకి వాయిదా వేసింది.