స్పీకర్ పదవిపై పీఠముడి
లోక్‌సభ స్పీకర్ ఎవరు అవుతారన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్నది. లోక్‌సభలో పూర్తిమెజారిటీ రాని బీజేపీకి ఎన్‌డీఏని అదుపులో ఉంచుకోవడానికి స్పీకర్ పదవి తీసుకోవడం తప్పనిసరి. బీజేపీ అగ్రనాయకత్వం అదే విషయం పరోక్షంగా భాగస్వామ్య పక్షాలకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయవర్గాల కథనం
విధాత ప్రత్యేకం-
లోక్‌సభ స్పీకర్ ఎవరు అవుతారన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్నది. లోక్‌సభలో పూర్తిమెజారిటీ రాని బీజేపీకి ఎన్‌డీఏని అదుపులో ఉంచుకోవడానికి స్పీకర్ పదవి తీసుకోవడం తప్పనిసరి. బీజేపీ అగ్రనాయకత్వం అదే విషయం పరోక్షంగా భాగస్వామ్య పక్షాలకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయవర్గాల కథనం. కానీ ఎన్‌డీఏలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టీడీపీ, జేడీయూ ఆ పదవిని తమకంటే తమకు కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. స్పీకర్ పదవి తీసుకుంటే బీజేపీ రేపు ఎప్పుడయినా తమకు ఇబ్బందులు తలపెట్టకుండా కట్టడి చేయవచ్చునని ఆ పార్టీలు భావిస్తున్నాయి. సంకీర్ణ రాజకీయాల కాలంలో స్పీకర్ పదవి చాలా కీలకం. ఎంపీల అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్న యుగంలో తప్పును ఒప్పు చేయడానికి, ఒప్పును తప్పుగా చూపించడానికి స్పీకర్ పదవి కీలకం. స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి సభలోని అన్ని పక్షాల పట్ల సమదృష్టితో వ్యవహరించాలి. గతంలో చాలా మంది స్పీకర్లు అలా ఉన్నారు. బీజేపీ హయాంలో మాత్రం స్పీకర్లు దాదాపు పార్టీ ప్రతినిధులుగానే వ్యవహరించారు. ఈసారి కూడా బీజేపీ స్పీకర్ పదవిని వదులుకునే అవకాశం లేదు. గత లోక్‌సభలో స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా ఈ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోట నుంచి తిరిగి గెలిచారు. ఆయనకు మొన్న మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మళ్లీ ఆయనను స్పీకర్ చేస్తారా లేక కొత్త నాయకుడిని ఎవరినయినా ముందుకు తెస్తారా అన్నది వేచి చూడవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పీకర్ అవుతారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే అందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంగీకరిస్తారా లేదా అన్నది సందేహాస్పదం. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పనిచేసిన నేపథ్యంలో చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాల మధ్య సఖ్యత కుదిరి ఉంటే రాజీ మార్గంగా పురందేశ్వరి స్పీకర్ కావడానికి మార్గం సుగమం కావచ్చు. కానీ నరేంద్రమోడీ వ్యవహార సరళి తెలిసినవారెవరూ ఆయన స్పీకర్ విషయంలో రాజీపడతారని భావించడం లేదు. కచ్చితంగా ఉత్తర భారతం నుంచే గట్టి సంఘ్ వారసత్వం ఉన్న నాయకుడినే స్పీకర్‌గా ఎంచుకునే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram