Punjab Ex-DGP Son Death Mystery | కోడలుతో మాజీ డీజీపీ బంధం..కొడుకు హత్య!?

మహ్మద్ ముస్తాఫా కుమారుడు అఖీల్‌ అక్తర్ మరణం హత్య కేసుగా మారి కుటుంబ సభ్యులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Punjab Ex-DGP Son Death Mystery | కోడలుతో మాజీ డీజీపీ బంధం..కొడుకు హత్య!?

న్యూఢిల్లీ : పంజాబ్‌లో మాజీ డీజీపీ మహ్మద్‌ ముస్తాఫా కుమారుడు అఖీల్‌ అక్తర్‌ మృతి ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అఖీల్ అక్తర్ మృతిని తొలుత అనుమానస్పదంగా భావించారు. అయితే తాజాగా అక్తర్ కు సంబంధించిన ఓ వీడియోతో అతని మరణం హత్య కేసుగా మలుపు తిరిగింది. ఆ వీడియోలో తన భార్యతో తండ్రి మాజీ డీజీపీ మహ్మద్ ముస్తాఫాకు సన్నిహిత సంబంధం ఉందంటూ అఖీల్‌ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో పోలీసులు మృతుడి కుటుంబసభ్యులపై హత్య అభియోగాలు మోపి కేసు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్‌ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అఖీల్‌ తండ్రి ముస్తాఫా మాజీ డీజీపీ కాగా, తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలుగా ఉన్నారు.

33 ఏళ్ల అఖీల్‌ అక్తర్‌ ఇటీవల అక్టోబరు 16న పంచకులలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయి కన్పించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డ్రగ్‌ ఓవర్‌డోస్‌ కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు అఖీల్‌ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అఖీల్‌ మరణించిన కొద్ది రోజుల తర్వాత అతడి స్నేహితుడు షామ్‌షుద్దీన్‌ చౌద్రీ పోలీసులను ఆశ్రయించారు. అతడిని హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అదే సమయంలో ఆగస్టు 27న అఖీల్‌ రికార్డు చేసిన ఓ వీడియో తాజాగా బయటకు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అందులో మాజీ డీజీపీపై మృతుడు సంచలన ఆరోపణలు చేశాడు.

నా భార్యకు నా తండ్రితో సన్నిహిత సంబంధం ఉందని… ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను మానసికంగా కుంగిపోయానని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని తెలిపాడు. ఈ అక్రమ సంబంధం గురించి మా ఇంట్లో తల్లి, సోదరకి కూడా తెలుసు అని పేర్కొన్నాడు. వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారని అకీల్‌ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ కుట్రలో నా తండ్రితో పాటు తల్లి, సోదరి కూడా భాగస్వాములే అని అఖీల్‌ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో ఈ వీడియో ఆధారంగా పోలీసులు ముస్తాపా, ఆయన సతీమణి రజియా సుల్తానా, కూతురు, కోడలి పైనా బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.