Bhupalpally : ప్రియుడితో కలిసి భర్త, కుమార్తెల హత్య

భర్త, కుమార్తెలను ప్రియుడితో కలిసి హత్య చేసిన కేసులో కాపల కవిత, జంజర్ల రాజ్ కుమార్ అరెస్ట్. క్షుద్రపూజ నాటకం ప్రయత్నం తెలిసింది.

Bhupalpally : ప్రియుడితో కలిసి భర్త, కుమార్తెల హత్య

మభ్యపెట్టేందుకు అనేక ప్రయత్నాలు
క్షుద్రపూజలు చేశారని నాటకాలు
కేసును చేధించిన కాటారం పోలీసులు
కటకటాలు లెక్కిస్తున్న ఇద్దరు నిందితులు

విధాత వరంగల్ ప్రతినిధి: తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ముందు భర్తను, తర్వాత కుమార్తెను ప్రియుడితో కలిసి హత్యచేసిన సంఘటనను కాటారం పోలీసులు చేధించారు. అనారోగ్యానికి గురై ఇంట్లో ఉంటున్న భర్తను ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్యే ముందుగా పథకం ప్రకారం హత్యచేసి, కొద్ది రోజుల్లోనే అడ్డంకిగా ఉన్న కుమార్తెను సైతం కన్నతల్లి చంపి క్షుద్రపూజలు చేసేందుకు తన బిడ్డను హత్యచేశారని నమ్మించేందుకు ప్రయత్నించిన ఇద్దరి నిందితులు కటకటాలపాలయ్యారు. భూపాలపల్లి జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన కప్పల కవిత (43), జంజర్ల రాజ్ కుమార్(24)లను పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియుడు రాజ్కుమార్తో కలిసి టీవీఎస్ ఎక్సెల్ వాహనం పై మహారాష్ట్రకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో అరెస్టు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి (50 ) వ్యవసాయం చేస్తూ జీవించేది. భార్య చనిపోగా 24 సంవత్సరముల క్రితం కవితను రెండవ వివాహం చేసుకున్నారు. వీరికి వర్షిని(22), హన్సిక(21) చిన్న అమ్మాయికి వివాహమై అత్తింటికి వెళ్లిపోగా పెద్దమ్మాయి వర్షిని తోపాటు భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఐదు సంవత్సరముల క్రితం కుమారస్వామికి పక్షవాతం వచ్చి ఇంటికి పరిమితమయ్యారు.

అడ్డుగా మారాడని భర్త హత్య

భర్త అనారోగ్యానికి గురికావడంతో కవిత, అవివాహితుడైన జంజర్ల రాజ్ కుమార్ తో మూడేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.ఈ విషయం భర్తకు తెలియడంతో పంచాయతీలు అయ్యాయి. ఈ క్రమంలో రాజ్ కుమార్, కవితలు తమ సంబంధానికి అడ్డువస్తున్న కుమారస్వామిని అంతమొందించేందుకు పథకం పన్ని ఈ ఏడాది జూన్ 25వ తేదీన కుమార్తె ఇంట్లో లేని సమయంలో హత్యచేశారు. భర్తను కవిత కదలకుండా కాళ్లు పట్టుకోగా ప్రియుడు గొంతు నొలిమి హత్య చేశారు. ఇదంతా ఏం తెలియనట్లు తన భర్త అనారోగ్య కారణంతో చనిపోయాడని అందరినీ నమ్మించారు.

నెలరోజుల తర్వాత కన్న బిడ్డ హత్య

తల్లి వివాహేతర సంబంధం పై పెద్ద కూతురైన వర్షిని తల్లిని నిలదీయడం, రాజ్ కుమార్ ని అడ్డుకుంటోంది. దీంతో ఈ అమ్మాయిని అడ్డు తొలగిస్తే ఎటువంటి అడ్డంకులు ఉండవని మరో పన్నాగం పన్నారు. ఆగస్టు 3వ తేదీ తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న తన కుమార్తె వర్షిని ని భర్తను చంపిన విధంగానే ఇరువురు కలిసి హత్య చేశారు. మృతదేహాన్ని సంచిలో మూటకట్టి వెనకాల ఉన్న చెట్ల పొదలలో దాచిపెట్టారు. రాత్రి సమయంలో మూటను ఒడితల గ్రామ శివారులోని దుబ్బగట్టుగుట్ట చెట్ల పొదలలో పడేశారు. బంధువుల ఒత్తిడి మేరకు 6వ తేదీన కవిత చిట్యాల పోలీస్ స్టేషన్ తన బిడ్డ కనపడడం లేదని ఫిర్యాదు చేశారు. గుట్టలో దాచిన శవాన్ని రాజకుమార్ రెండు రోజులకోకసారి వెళ్లి చూసి వస్తున్నాడు. శవాన్ని ఎవరైనా చూస్తే విషయం బయటపడుతోందని క్షుద్రపూజల పథకాన్ని రచించారు.

క్షుద్రపూజ నాటకం

ఆగస్టు 25వ తేదీన రాత్రి ఏడు గంటలకు శవాన్ని రాజ్ కుమార్ తన టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పైన తీసుకొచ్చి కాటారం వైపు హైవే పక్కన పడేశాడు.అందరిని నమ్మించేందుకు యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న క్షుద్ర పూజల ప్రకారం శవం పైన పసుపు కుంకుమ చల్లి, నిమ్మకాయలు ఉంచి శవం చుట్టూ ఇనుప మేకులు కొట్టి క్షుద్ర పూజలు చేసి చంపినట్లుగా చిత్రీకరించారు. ఆ తర్వాత కప్పల కవిత, రాజ్కుమార్ ఇద్దరూ గ్రామం నుంచి వెళ్ళిపోయి మహారాష్ట్రలో పనిచేసుకుని బతికేందుకు టీవీఎస్ పై వెళుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన పద్ధతిలో విచారించారు. దీంతో ముందు తన భర్తను,తర్వాత బిడ్డను తన ప్రియుడితో కలిసి హత్యచేసి అందరినీ నమ్మించినట్లు తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. హత్య కేసులను చేధించిన కాటారం డీఎస్పీసూర్యనారాయణ, సీఐ నాగార్జున రావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.