Chandipura Virus | బహుపరాక్‌ బహుపరాక్‌.. పిల్లల ప్రాణాలు తీస్తున్న ప్రాణాంతక వైరస్..!

Chandipura Virus | గుజరాత్‌లో చాందిపురా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ 13 మందికి ఈ వైరస్ సోకగా వారిలో ఐదుగురు మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖనే స్పష్టంచేసింది. నాలుగేళ్ల బాలిక ఈ చండీపురా వైరస్ బారినపడి మరణించినట్టు పుణేలోని నేచురల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ప్రకటించింది.

Chandipura Virus | బహుపరాక్‌ బహుపరాక్‌.. పిల్లల ప్రాణాలు తీస్తున్న ప్రాణాంతక వైరస్..!

Chandipura Virus : గుజరాత్‌లో చాందిపురా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ 13 మందికి ఈ వైరస్ సోకగా వారిలో ఐదుగురు మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖనే స్పష్టంచేసింది. నాలుగేళ్ల బాలిక ఈ చండీపురా వైరస్ బారినపడి మరణించినట్టు పుణేలోని నేచురల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ఈ వైరస్ బారినపడిన రోగులను గుర్తించారు.

ఏమిటీ చాందిపురా వైరస్..?

ఈ వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో స్క్రీనింగ్ జరుగుతోంది. ఎంతమందికి ఈ వైరస్ సోకిందో గుర్తించడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ మన దేశానికి కొత్త కాదు. 2003-2004 సంవత్సరాల మధ్యలో ఈ చాందిపురా వైరస్ కారణంగా ఎన్నో మరణాలు సంభవించాయి. అంతకుముందు తొలిసారి భారతదేశంలో ఈ వైరస్‌ను 1965లో మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలోగల చాందీపురా గ్రామంలో గుర్తించారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌లలో అప్పట్లో ఈ వైరస్ వ్యాపించింది. అందుకే ఈ వైరస్‌కు ఆ గ్రామం చాందీపురా గ్రామం పేరే పెట్టారు.

చాందీపురా వైరస్ సోకిన వ్యక్తుల్లో ఎక్కువ శాతం మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారే. ఇది ముఖ్యంగా పిల్లలనే ఎందుకు టార్గెట్ చేస్తోందంటే వారి రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. ఈ వైరస్ రాబ్డోవిరిడే అనే కుటుంబానికి చెందినది. వర్షాకాలంలో ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా శాండ్ ఫ్లై (Sand Fly) అని పిలిచే కీటకంవల్ల ఇది ప్రజల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నది. దోమల వల్ల కూడా ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

చాందిపురా వైరస్ లక్షణాలు

ఈ వైరస్ సోకిన వారికి జ్వరం తీవ్రంగా వస్తుంది. తలనొప్పిగా ఉంటుంది. మూర్ఛలు వచ్చి పోతుంటాయి. ఈ మూర్చలు చివరికి కోమాకు, మరణానికి కూడా దాడి తీస్తాయి. రోగ నిర్ధారణ చేసి తక్షణం చికిత్స అందించకపోతే పిల్లల్లో మరణాల రేటు పెరిగిపోతుంది. కాబట్టి పిల్లలను ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో పిల్లలు ఎలాంటి దోమ కాటుకు, కీటకాల కాటుకు గురికాకుండా చూసుకోవాలి. శరీరమంతా కప్పేలా పిల్లలకి దుస్తులను వేయాలి. సాయంత్రం, తెల్లవారుజామున ఈ శాండ్‌ ఫ్లై అధికంగా తిరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని నివారించేందుకు క్రిమిసంహారక స్ప్రేలు వాడాలి.

2003లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్ సోకిన పిల్లలను గుర్తించారు. వారి వయసు 9 నెలల నుంచి 14 ఏళ్ల మధ్య ఉంది. వీరు ఆస్పత్రిలో చేరినప్పటికీ 48 గంటల్లోనే మరణాలు సంభవించాయి. ప్రస్తుతం గుజరాత్‌లో అనుమానాస్పదంగా మరణిస్తున్న పిల్లల్లో ఈ వైరస్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ వైరస్‌కు ఇప్పటివరకు నిర్దిష్ట యాంటీ వైరల్ ఏజెంట్ లేదా టీకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లును వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గదులు చీకటిగా లేకుండా చూసుకోవాలి.