నీట్ పేపర్ లీకేజీ వివాదం..కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్ధుల నిరసనల విరమణ దిశగా కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు ముగిశాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్.. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ లు హాజరయ్యారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వేదికగా గంటన్నరకు పైగా చర్చలు సాగించారు.
మూడు డిమాండ్లను కేంద్రం ముందు పెట్టాం
చర్చలకు సంబంధించిన వివరాలను సీజేపీ వెల్లడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కేంద్రాన్ని స్పష్టంగా కోరాం అని పేర్కొంది. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాం. విద్యార్థులపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరాం. ఈ మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచాం అని సీజేపీ తెలిపింది. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం కోసం రేపు మధ్యాహ్నం వరకు డెడ్ లైన్ ఇచ్చినట్లుగా తెలిపారు. రేపు మరోసారి కేంద్రంతో చర్చలు జరుపుతాం అని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.
అయితే చర్చల సందర్భంగా కేంద్రం విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు హామీ ఇచ్చిందని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులకు పరిహారం చెల్లింపు పరిశీలిస్తామని చెప్పిందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ను ప్రధానికి తెలియచేస్తామని కేంద్ర మంత్రుల బృందం చెప్పినట్లుగా తెలుస్తుంది.
